మోదీకి మరింత చేరువగా పవన్?
వీలైనంత త్వరగా బిజెపికి దగ్గరయ్యేందుకు జనసేనాని ప్రయత్నిస్తున్నారా? ఆయన మాటలు, చేతలు చూస్తుంటే నిజమేనంటున్నారు పరిశీలకులు. బిజెపిని తానేనాడూ శత్రువుగా భావించలేదంటూ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్.. చివరికి మోదీ జపం దాకా వెళ్ళారు. దాంతో జనసేనను బిజెపిలో విలీనం చేస్తారన్న ప్రచారం మొదలైంది. దాన్నేమాత్రం ఖండించని పవన్ కల్యాణ్.. బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్ ప్రభుత్వంపైనా, వైస్సార్సీ పార్టీ పైనా దూకుడు పెంచారు. అది కొనసాగుతుండగానే మరోసారి మోదీని ప్రసన్నం చేసుకునే చర్యకు […]
వీలైనంత త్వరగా బిజెపికి దగ్గరయ్యేందుకు జనసేనాని ప్రయత్నిస్తున్నారా? ఆయన మాటలు, చేతలు చూస్తుంటే నిజమేనంటున్నారు పరిశీలకులు. బిజెపిని తానేనాడూ శత్రువుగా భావించలేదంటూ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్.. చివరికి మోదీ జపం దాకా వెళ్ళారు. దాంతో జనసేనను బిజెపిలో విలీనం చేస్తారన్న ప్రచారం మొదలైంది. దాన్నేమాత్రం ఖండించని పవన్ కల్యాణ్.. బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్ ప్రభుత్వంపైనా, వైస్సార్సీ పార్టీ పైనా దూకుడు పెంచారు. అది కొనసాగుతుండగానే మరోసారి మోదీని ప్రసన్నం చేసుకునే చర్యకు ఉపక్రమించారు పవన్ కల్యాణ్.
2014లో పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం మొదలైందే నరేంద్ర మోదీ భజనతో. ఆనాడు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. ఓవైపు పవన్ కల్యాణ్.. ఇంకోవైపు చంద్రబాబు.. వీలైనంతగా మోదీ జపం చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలలో ఎవరి వ్యూహాలకు అనుగుణంగా వారు వేర్వేరుగా పోటీకి దిగారు. ఓటమి పాలయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్… చంద్రబాబు దత్తపుత్రుడంటూ.. పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.
మీరొకటి అంటే నేను రెండంటా అంటూ సమరానికి సై అంటున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి అయినా దాన్ని డామినేట్ చేసే రేంజ్‌లో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. అధినేత అండ చూసుకున్న జనసేన వర్గాలు.. పవన్ కల్యాణ్ ఆదేశిస్తే.. వైసీపీ నేతల తలలు నరుకుతామంటూ బీరాలు పలుకుతున్నారు. ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయమైతే.. జనసేనాధిపతి అటు జాతీయ స్థాయిలోను కొంత పరిణితి చెందిన రాజకీయం ప్రదర్శిస్తున్నారా అనిపించేలా స్టెప్స్ తీసుకుంటున్నారు.
పదిహేను రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన పవన్ కల్యాణ్.. అక్కడ ఎవరిని కలిశారు అన్నది మాత్రం సీక్రెట్‌గా వుంచారు. ఆ తర్వాత మొదలైన రాయలసీమ పర్యటనలో దూకుడు ప్రదర్శించారు. వైసీపీ మీద, జగన్ సర్కార్ మీదా ఘాటైన విమర్శలు చేశారు. అదే సమయంలో బిజెపికి దగ్గరవుతున్న సంకేతాలిచ్చారు. దాంతో జనసేన బిజెపిలో విలీనమవుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవైపు టిడిపి బాగా బలహీన పడిన తరుణంలో పవన్ కల్యాణ్‌ను బిజెపిలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు బిజెపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయాలన్నది కమలం పార్టీ వ్యూహమన్న విశ్లేషణలు వినిపించాయి.
తాజాగా మోదీని ప్రస్తుతిస్తూ పవన్ కల్యాణ్ మరోపని చేశారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్రీయ సైనిక్ బోర్డుకు తాను వ్యక్తిగతంగా కోటి రూపాయల డొనేషన్ ప్రకటించారు. దేశాన్ని పరిరక్షిస్తున్న సైనికులకు ప్రతీ భారతీయుడు అండగా నిలబడాలన్న ప్రధాన నరేంద్ర మోదీ.. తన బాధ్యత తనకు గుర్తు చేశారంటూ పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తానే స్వయంగా ఢిల్లీ వెళ్ళి కోటి రూపాయల డి.డి.ని సంబంధిత అధికారులకు అందజేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సో.. మోదీని కలిసేందుకు మరోసారి ఢిల్లీ బాట పడుతున్నారంటున్నారు నెటిజన్లు.