చారిత్రక తప్పిదం నోట్ల రద్దు.. ఇకనైనా మేల్కోండి మోదీ జీ !

నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేదు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు సడన్‌గా మోదీ చేసిన ప్రకటన ఆనాడు దేశంలో పెద్ద కుదుపునే సృష్టించింది. రెండు నెలల్లో దేశంలోని నల్ల ధనమంతా బయటికి వచ్చేస్తుందని ఆనాటి ప్రకటనలో నరేంద్ర మోదీ గట్టి విశ్వాసంతో చెప్పారు. ఈ నల్లడబ్బు బయటికి వచ్చేస్తే దేశాన్ని పూర్తిగా శుభ్రం చేస్తానని ఆయన ప్రకటించారు […]

చారిత్రక తప్పిదం నోట్ల రద్దు.. ఇకనైనా మేల్కోండి మోదీ జీ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 12, 2019 | 12:43 PM

నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేదు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు సడన్‌గా మోదీ చేసిన ప్రకటన ఆనాడు దేశంలో పెద్ద కుదుపునే సృష్టించింది. రెండు నెలల్లో దేశంలోని నల్ల ధనమంతా బయటికి వచ్చేస్తుందని ఆనాటి ప్రకటనలో నరేంద్ర మోదీ గట్టి విశ్వాసంతో చెప్పారు. ఈ నల్లడబ్బు బయటికి వచ్చేస్తే దేశాన్ని పూర్తిగా శుభ్రం చేస్తానని ఆయన ప్రకటించారు కూడా. రెండు నెలల సమయం ఇస్తూ.. ప్రజల దగ్గరున్న 500, 1000 నోట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించారు మోదీ.
ఆ మర్నాటి నుంచే దేశంలో ఒక ప్యానిక్ పరిస్థితి కనిపించింది. నవంబర్ 8 మోదీ ప్రకటనను ఎవరు ఏనాటికి మరచిపోలేరు. దేశంలో చలామణీలో వున్న రూపాయల్లో సుమారు 18 లక్షల కోట్ల రూపాయలు కేవలం వేయి రూపాయల నోట్ల రూపంలోనే వుందని, డిసెంబర్ ఆఖరు నాటికి ఆ మొత్తం రిజర్వు బ్యాంకుకు చేరుతుందని మోదీ ఆనాడు చెప్పారు. ప్రజల దగ్గర వున్న 500, 1000 రూపాయల నోట్లను డిసెంబర్ 31, 2016లోగా మార్చుకోవాలని మోదీ ప్రకటించినా.. డిసెంబర్ 1వ వారంలోనే ఆ ఆఫర్‌ను క్లోజ్ చేశారు. కారణాలను కూడా రహస్యంగా వుంచేశారు.
నోట్ల రద్దు అనే ఓ మూర్ఖమైన పని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. చిన్న వ్యాపారస్తుల దగ్గరి నుంచి పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు దాదాపు అన్ని వర్గాల వారు దెబ్బతిన్నారు. వ్యవసాయదారులు చాలా ఇబ్బందుల పాలయ్యారు. బ్యాంకుల్లో ఎంతో కొంత వున్న సేవింగ్స్‌ని కోల్పోయారు. పెద్ద ఫ్యాక్టరీలు కలిగి వున్న పారిశ్రామిక వేత్తలు.. ముడి సరుకులు దొరక్క.. తయారు చేసిన వస్తువులను కొనే వారు లేక చాలా వెతలకు గురయ్యారు. దాదాపు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోయి.. స్వయం ఉపాధిమీద ఆధారపడి బతుకుతున్న వారి జీవనం ఛిద్రమైంది.
అయితే.. నరేంద్ర మోదీ తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఓ విఫల ప్రయోగమని ఈనాటికి రియలైజ్ కావడం లేదు. మహాత్మా గాంధీ అంతటి వారే ఆనాడు స్వాతంత్ర్యపోరాటంలో తన కారణంగా అతివాదులు బలవుతున్నారన్న సత్యాన్ని గ్రహించి.. పొరపాటు తనవల్లేనని అంగీకరించారు. కానీ మోదీలో ఆ రియలైజేషన్ లేదు. మోదీ ఓ పాపులర్ ప్రధాని.. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇందిరాగాంధీ తర్వాత అంతటి పవర్‌ఫుల్ ప్రధాని మోదీనే. నిజానికి మోదీ కొన్ని చక్కని నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు.
కానీ నోట్ల రద్దు లాంటి తప్పుడు నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చిన తప్పిదాన్నిఅంగీకరించేందుకు మాత్రం ఆయనకు ఈగో అడ్డొస్తోంది. నోట్ల రద్దు ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోవడం లేదు. ఆ నిజాన్ని అంగీకరించేందుకు మోదీ సిద్దంగా లేరు. ఇవాళ కూడా నోట్ల రద్దును తాను చేసిన మంచి పనుల్లో ఒకటిగానే మోదీ భావిస్తున్నారు. నిజానికి మోదీ తీసుకున్న ఆనాటి తప్పుడు నిర్ణయం వల్ల దేశ ప్రజలకు మన రూపాయి మీద నమ్మకం తగ్గిపోయింది. అమెరికన్ డాలర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో నమ్మకం వుంది. సుమారు 180 దేశాల్లో తమ సంపదను అమెరికన్ డాలర్ల రూపంలో దాచుకుంటున్నారు. కానీ మనమెంతో గౌరవించుకునే రూపాయి.. మోదీ తీసుకున్న ఒక అసంబద్ద నిర్ణయం వల్ల ప్రజాదరణ కోల్పోయింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.
ఏనాడు పెద్దగా ప్రసంగాలివ్వని, ఎవరినీ ఘాటుగా విమర్శించని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2016 డిసెంబర్‌లో రాజ్యసభలో కాస్త ఘాటుగానే నోట్ల రద్దును తప్పు పట్టారు. స్వతహాగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్.. ప్రజలు తాను కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న తమ సొంత డబ్బును బ్యాంకుల్లోంచి విత్ డ్రా చేసుకోలేక తంటాలు పడుతున్నారంటూ చేసిన కామెంట్లను ఎవరు మరిచిపోలేరు. ఎందుకంటే అది  నిజం కనుక.. ఆ బాధను దేశప్రజలు అనుభవించారు గనక. నిజానికి నోట్ల రద్దుపై దేశంలోని రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఎక్కడ తమ దగ్గర నల్లధనం వుందని, అందుకే నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నామని అనుకుంటారో అన్న భయంతో రాజకీయ నేతలు కూడా పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు.
మూడేళ్ళ తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావం వుందంటే ఆ నిర్ణయం ఎంతటి తప్పుడు నిర్ణయమో మోదీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. తన తప్పుడు నిర్ణయాన్ని బహిరంగంగా అంగీకరించకపోయినా.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పక్కా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా వుంది. దేశం ఆర్థికంగా పునరుజ్జీవం చెందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా వుంది. అప్పుడు కునారిల్లిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలోకి వస్తుంది. దేశ ప్రజలకు మన రూపాయిపై విశ్వాసం పెరుగుతోంది.