AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మహిళ స్నానం చేస్తుండగా పై నుంచి ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా..

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రాయగడ రోడ్డులో ఒక భవనం పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న ఆర్‌ఎంపి వైద్యుడు.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడంతో గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఆర్‌ఎంపి వైద్యుడు బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Andhra: మహిళ స్నానం చేస్తుండగా పై నుంచి ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా..
RMP Doctor
Follow us
G Koteswara Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2025 | 9:10 PM

మహిళలు స్నానాలు చేస్తుండగా సీక్రెట్‌గా వీడియోలు తీసిన ఓ ఘనుడికి దేహశుద్ధి చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన బిశ్వాల్ సర్కార్ గత కొన్ని నెలల క్రితం పార్వతీపురం పట్టణానికి చేరుకొని బొగ్గు వీధిలో నివాసముంటూ స్థానికంగా అందరికీ సుపరిచితమయ్యాడు. అనంతరం పట్టణంలో ఉన్న భవాని ఫైల్స్ అనే ఆస్పత్రిలో ఆర్ ఎం పి వైద్యుడిగా జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న బిశ్వాల్ సర్కార్ ఎక్కువ సమయం హాస్పిటల్ లోనే ఉండేవాడు. అయితే హాస్పటల్ వెనుక వైపు దుగరాజు పేట అనే కాలనీ ఉంది. ఆ కాలనీ పరిసర ప్రాంతమంతా గ్రామీణ వాతావరణం తలపిస్తుంటుంది. అక్కడ నివాసముండే స్థానికుల కుటుంబాల్లో స్నానపు గదులకు పైన ఎలాంటి పై కప్పులు లేకుండా ఓపెన్ గా ఉంటాయి. దాదాపు ఈ పరిసర ప్రాంతంలో ఎక్కువ మంది అలాంటి స్నానపు గదులనే వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకరోజు సాయంత్రం హాస్పిటల్‌ పైకి వెళ్లిన బిస్వాల్  ఓ స్నానం గదిలో మహిళ స్నానం చేయడాన్ని గమనించాడు. ఆపై ఆ మహిళ స్నానం చేస్తున్న వీడియోలను, ఫోటోలను తమ సెల్ ఫోన్ తో తీశాడు. ఆ క్రమంలోనే ఉదయం, సాయంత్రం మహిళలు స్నానం చేసే సమయాన్ని గమనించి మరికొంతమంది మహిళల ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. అలా నిత్యం స్థానిక మహిళల ఫోటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

ఈ క్రమంలోనే ఒకరోజు స్నానం చేస్తున్న ఒక మహిళకు బిశ్వాల్ సర్కార్ వ్యవహారాన్ని గమనించింది. వెంటనే ఆ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన ఇరుగుపొరుగు వారిని తీసుకొని హాస్పిటల్ వద్దకు వచ్చి  మేడపై ఉన్న బిశ్వాల్ వద్దకు వెళ్లారు. అక్కడ బిశ్వాల్ తప్ప మరో వ్యక్తి లేకపోవడంతో తమ ఫోటోలు తీసిన వ్యక్తి బిశ్వాల్ అని గుర్తించి నిలదీశారు. వెంటనే సెల్ ఫోన్ లాక్కొని పరిశీలించగా ఫోన్ లో మహిళల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు చెప్పులతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బిశ్వాల్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మహిళల చేతిలో చావుదెబ్బలు తిన్న బిశ్వాల్ తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిశ్వాల్ కోలుకున్న తర్వాత రిమాండ్‌కి తరలించే అవకాశం ఉంది. అయితే స్థానిక మహిళల ఫోటోలు, వీడియోలు తీసి బిశ్వాల్ ఏమి చేసేవాడు? పైశాచిక ఆనందం పొందేవాడా? లేక సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడా? అనే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..