ఆ మానుకోట రాళ్ల కిందే రాజకీయ సమాధి చేస్తాం.. బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
మానుకోట రాళ్ల చరిత్ర, అవి ఎక్కడ ఉన్నాయో కూడా కనీసం తెలువని బిజెపి బండి సంజయ్ మానుకోటకు వచ్చి ఆ రాళ్ల గురించి మాట్లాడితే వాటికిందే సమాధి చేస్తామని..
మానుకోట రాళ్ల చరిత్ర, అవి ఎక్కడ ఉన్నాయో కూడా కనీసం తెలువని బిజెపి బండి సంజయ్ మానుకోటకు వచ్చి ఆ రాళ్ల గురించి మాట్లాడితే వాటికిందే సమాధి చేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం మానుకోట రాళ్లు వేసినప్పుడు బండి సంజయ్ కౌన్సిలర్ గా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. మానుకోట రాళ్లు టిఆర్ఎస్ పార్టీసొంతమని, వాటి వల్ల ఫలాలు ఈ పార్టీకి దక్కితే వాటిని ప్రజలకు పంచుతున్న ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ దేనని చెప్పారు.
నూరేళ్లు నిండిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పీఠంలో కూర్చునే దిక్కు లేదని, రాష్ట్రంలో నలుగురు నాయకులు నాలుగు దిక్కుల్లో తిరుగుతూ దిక్కు లేకుండా ఉన్నారన్నారు. స్థానికుడు, గ్రాడ్యుయేట్ కానీ వ్యక్తి, గ్రాడ్యుయేట్ సమస్యలు తెలువని వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెట్టి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో ప్రత్యక్ష సంబంధాలుండి, నిత్యం ముఖ్యమంత్రి కేసిఆర్ కు నిత్యం సన్నిహితంగా ఉండి ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే పల్లా రాజేశ్వర్ రెడ్డిగారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందుతో కలిసి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
బిజెపి వల్ల ఈ రాష్ట్రానికిగానీ, మహబూబాబాద్ జిల్లాకు గానీ నేరుగా ఒరిగిందేమి లేదని, వారికి ఓటేస్తే చేసేదేంటో కూడా చెప్పలేకుండా అబద్దాలతో, విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి గిరిజనులకు ఉపయోగపడే గిరిజన యూనివర్శిటీ రాకుండా, గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని పంపించిన అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోకుండా గిరిజన వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపికి ఈ ప్రాంత ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేది లేదని చెబుతూ, తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్ల ఫ్యాక్టరీ తరలిపోయిందని అబద్దాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం బిజెపి నేతలు చేస్తున్నారని, ఈ ప్రాజెక్టు వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా రైల్వే వ్యవస్థకు పున:వైభవం వస్తుందన్న ఆశను ఆడియాశ చేసింది ఈ బిజెపియేనని, వీరికి సరైన బుద్ది చెప్పాలని కోరారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు అని కొట్లాడి ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఇక్కడి గిరిజనులు కాపాడుకుంటే దానిని ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని, కేంద్రం ఈ ప్రాజెక్టు ప్రారంభించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారం ఫ్యాక్టరీ ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గిరిజన యూనివర్శిటీ ప్రారంభించి, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి, అనేక కేంద్ర ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణలో మాత్రం ఏ ఒక్కటి ఇవ్వకుండా బిజెపి తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని,దీనికి ఈ ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అన్ని రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగాయని, గౌరవం పెరిగిందని, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ జరిగిందన్నారు. మునిగిపోతున్న ఆర్టీసిని 2000 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడి నెత్తిన పెట్టుకున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, 1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. కానీ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకుని ప్రధాని అయ్యానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఇప్పుడు రైల్వే సంస్థను తెగనమ్ముతున్నారని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని, దీనిని పట్టభద్రులు గుర్తించాలని విజ్ణప్తి చేశారు.
తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్రించిన వారికి తెలంగాణ వస్తే మానుకోట జిల్లా వచ్చింది, కొత్తగా మండలాలు, గ్రామాలు వచ్చాయి, 300 పడకల హాస్పిటల్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చిందనేవి సమాధానాలన్నారు. మానుకోటకు రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఇస్తే కేంద్రం పక్కన పెట్టిందని, కొట్లాడి దీనిని సాధిస్తామని, మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. మానుకోట బిడ్డలుగా మంత్రిగా తాను, జడ్పీగా బిందు, ఎంపీగా మాలోతు కవిత, ఎమ్మెల్యేలుగా రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్ లు ఉన్నామని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమకుందని, తమ మాట గౌరవించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కావల్సింది ప్రశ్రించే గొంతులు కాదని, పరిష్కరించే కేసిఆర్ వంటి నాయకులని, కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని పట్టభద్రులందరికి విజ్ణప్తి చేస్తున్నానని చెప్పారు.
Read More:
ఆదివారాల్లో సైతం రిజిస్ట్రేషన్లు.. పెండింగ్ పనులు పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు