AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!
Liberation For Gramakantam Lands
Balaraju Goud
|

Updated on: May 19, 2026 | 8:59 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. దీనివల్ల వంశపారంపర్యంగా వస్తున్న ఇళ్లు, ఖాళీ స్థలాల యజమానులకు భారీ ఉపశమనం లభించనుంది.

సాధారణంగా గ్రామాల్లోని నివాస ప్రాంతాలను ‘గ్రామకంఠం’గా పిలుస్తారు. వాస్తవానికి ఇవి ప్రభుత్వ భూములు కావు, కానీ వెబ్‌లాండ్ రికార్డుల్లో స్పష్టమైన సబ్-డివిజన్ లేకపోవడం వల్ల చాలా చోట్ల ఇవి 22A (నిషేధిత జాబితా)లో ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. దీనివల్ల వారసత్వంగా వస్తున్న ఆస్తులను అమ్ముకోవాలన్నా, వేరొకరికి బదలాయించాలన్నా రిజిస్ట్రేషన్ శాఖ అంగీకరించేది కాదు. పైగా పాత ఇళ్లకు సంబంధించి లింకు డాక్యుమెంట్లు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది.

తాజా మార్గదర్శకాలు:

  1. నిషేధిత జాబితాతో సంబంధం లేదు: వెబ్‌లాండ్ రికార్డుల్లో ఏదైనా సర్వే నంబరు ‘గ్రామకంఠం’ అని ఉంటే, అది 22A జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి మినహాయింపు కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు.
  2. పన్ను రశీదులే ప్రామాణికం: ఇల్లు ఉండి, ఎలాంటి లింకు దస్తావేజులు లేని పక్షంలో.. స్థానిక సంస్థలు పంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి పన్ను రశీదును ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
  3. ఖాళీ స్థలాలకు వెసులుబాటు: పట్టణ ప్రాంతాల్లో లింకు డాక్యుమెంట్లు లేని వంశపారంపర్య ఖాళీ స్థలాలకు ఖాళీ స్థల పన్ను (VLT) రశీదును ప్రామాణికంగా తీసుకోవాలి.
  4. లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు: పాత ఆస్తులకు లింకు డాక్యుమెంట్లు ఉండవు కాబట్టి, వాటి కోసం దరఖాస్తుదారులను వేధించకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించింది.

గ్రామీణ ప్రాంతాల వారికి ‘సెల్ఫ్ డిక్లరేషన్’

గ్రామాల్లోని ఖాళీ స్థలాలకు పన్ను రశీదులు కూడా లేని పక్షంలో, రిజిస్ట్రేషన్ పత్రంలోనే ‘స్వయం ధ్రువీకరణ’ (Self-Declaration) పొందుపరిచే వెసులుబాటు కల్పించారు. సదరు ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందని, దానిని తాము అనుభవిస్తున్నామని, అది 22A పరిధిలోకి రాదని యజమాని స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ఒత్తిడి చేయకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో, పట్టణాల్లోని పాత నివాస ప్రాంతాల్లో ఆస్తులు ఉన్న లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా భూముల క్రయవిక్రయాలు సజావుగా సాగడమే కాకుండా, ఈ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కూడా కలుగుతుంది. 2026 ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us