నార్మల్ పెట్రోల్ vs పవర్ పెట్రోల్.. మీ వాహనానికి ఏది బెస్ట్..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి..
Normal vs Premium Petrol: పెట్రోల్ బంకుల్లో మనకు కనిపించే నార్మల్ Vs పవర్ పెట్రోల్ వెనుక పెద్ద కథే ఉంది. అధిక ఆక్టేన్ రేటింగ్ ఉండే ప్రీమియం పెట్రోల్ మీ ఇంజిన్‌ను లోపలి నుండి ఎలా శుభ్రం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదే సమయంలో ప్రతి వాహనానికి పవర్ పెట్రోల్ అవసరం లేదన్న నిజాన్ని కూడా మీరు గుర్తించాలి. మీ బైక్ లేదా కారుకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

పెట్రోల్ బంకుకు వెళ్లగానే సేల్స్ మెన్ అడిగే మొదటి ప్రశ్న.. నార్మల్ కొట్టించాలా? పవర్ కొట్టించాలా?. లీటరుకు ఐదు పది రూపాయల తేడా ఉండటంతో చాలామంది నార్మల్ పెట్రోల్ వైపు మొగ్గు చూపుతారు. కానీ మీ కారు లేదా బైక్ ఇంజిన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నా, పికప్ తగ్గుతున్నా మీరు వాడుతున్న ఇంధనం గురించి ఆలోచించాల్సిందే. సాధారణ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్ మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఆక్టేన్ రేటింగ్. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 87 నుండి 91 వరకు ఉంటుంది. అదే ప్రీమియం పెట్రోల్ రేటింగ్ 91 నుండి 95 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్‌లో ఇంధనం క్రమబద్ధంగా మండినప్పుడే వాహనం స్మూత్‌గా నడుస్తుంది. ఆక్టేన్ రేటింగ్ తక్కువగా ఉంటే ఇంధనం అస్తవ్యస్తంగా మండిపోయి ఇంజిన్ నుంచి నాకింగ్ అనే శబ్దం వస్తుంది. అధిక ఆక్టేన్ ఉండే పవర్ పెట్రోల్ ఈ శబ్దాన్ని అరికట్టి ఇంజిన్ సాఫీగా నడిచేలా చేస్తుంది.
ఇంజిన్ లోపల క్లీనింగ్ సర్వీస్
ప్రీమియం పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటానికి కేవలం ఆక్టేన్ మాత్రమే కారణం కాదు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన డిటర్జెంట్లు, కెమికల్స్ కలుపుతారు. ఇవి ఇంజిన్ లోపల, ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వ్‌ల వద్ద పేరుకుపోయిన కార్బన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తాయి. దీనివల్ల ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా రిపేర్లు తక్కువగా వస్తాయి.
మైలేజీ పెరుగుతుందా? అపోహ Vs వాస్తవం
ప్రీమియం పెట్రోల్ పోయిస్తే మైలేజీ విపరీతంగా పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా మీ వాహనం ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మనం వాడే స్కూటర్లు లేదా బడ్జెట్ కార్ల ఇంజిన్లు తక్కువ కంప్రెషన్‌తో పనిచేస్తాయి. వాటికి నార్మల్ పెట్రోల్ సరిపోతుంది. హై-స్పీడ్, లగ్జరీ కార్లకు మాత్రం ప్రీమియం పెట్రోల్ వాడితేనే సరైన పర్ఫార్మెన్స్ లభిస్తుంది.
ధర ఎందుకు అంత భారం?
అధిక ఆక్టేన్ సాధించడానికి ఇంధనాన్ని శుద్ధి చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి తోడు ఇంజిన్ రక్షణ కోసం వాడే అదనపు అడిటివ్స్ వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అందుకే లీటరుకు కొన్ని రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
మీ వాహనానికి ఏది సరైనది?
సాధారణ బైకులు – కార్లు: మీరు వాడేది రెగ్యులర్ కమ్యూటర్ వాహనం అయితే సాధారణ పెట్రోల్ చాలు. అయితే నెలకు ఒకసారి పవర్ పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్ లోపల కార్బన్ క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది.
హై-ఎండ్ వాహనాలు: మీరు లగ్జరీ కార్లు లేదా స్పోర్ట్స్ బైకులు వాడుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రీమియం వాడాలి. మీ వాహన మాన్యువల్ చూస్తే అందులో ఏ రేటింగ్ పెట్రోల్ వాడాలో స్పష్టంగా ఉంటుంది.
