Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చోటు చేసుకున్న కీలక పరిణామాలు..
టీడీపీ ఆందోళనల నేపథ్యంలో విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గన్నవరం రాకుండా.. బేగంపేట ఎయిర్‌పోర్టులోనే పవన్ ప్రత్యేక విమానాన్ని నిలిపివేశారు పోలీసులు. చంద్రబాబును కలిసేందుకు కేవలం భువనేశ్వరి, లోకేష్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు. బాబు తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను టీడీపీ పిలిపించింది. ప్రత్యేక విమానంలో ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

* చంద్రబాబును సీఐడీ ఆఫీసుకు తరలించారు. సీఐడీ ఆఫీసులో చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు అధికారులు. స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారు. అదనంగా మరో కాన్వాయ్‌ని సిద్ధం చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరుపరుస్తారు సీఐడీ అధికారులు.
* చంద్రబాబును ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని జగన్ ఆశిస్తున్నారని చెప్పారు బాలకృష్ణ. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా హిందూపూర్‌లో తాను కూడా క్యాంప్ ఏర్పాటు చేసి ఉద్యోగాలిప్పించామన్నారు. ఈ చేతగాని ప్రభుత్వంలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలులేవని విమర్శించారు.
* టీడీపీ ఆందోళనల నేపథ్యంలో విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గన్నవరం రాకుండా.. బేగంపేట ఎయిర్‌పోర్టులోనే పవన్ ప్రత్యేక విమానాన్ని నిలిపివేశారు పోలీసులు. చంద్రబాబును కలిసేందుకు కేవలం భువనేశ్వరి, లోకేష్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు.
* బాబు తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను టీడీపీ పిలిపించింది. ప్రత్యేక విమానంలో ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గతంలో అమరావతి కేసులోనూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబుకు సంబంధించిన అన్ని కేసులను సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్నారు.
* చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏపీ సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. వైసీపీ తరపున గట్టి వాదనలు వినిపించడంలో సుధాకర్ రెడ్డి దిట్ట. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున అనేక కేసులు సుధాకర్ రెడ్డి వాదించారు.
* చంద్రబాబు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఉరితీస్తారా అని ప్రశ్నించడమేంటన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తే కుదరదు అన్నారు.
* 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలలకే స్కిల్ డెవలప్మెంట్ స్కాం పురుడు పోసుకుందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. కేబినెట్ లో పెట్టింది ఒకటి.. బయట వీరు చేసిందొకటి అన్నారు. సెక్రటరీస్, ఉన్నతాధికారులను ఓవర్ రూల్ చేసి కేబినెట్ లో నోట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధం అని ఆరోపించారు.
* రాజకీయ విలువలు భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు మంత్రి చెల్లుబోయిన వేణు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు చంద్రబాబు స్కామ్‌ను బయటపెట్టాయన్నారు. చంద్రబాబును సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
* సీఎం పదవి చేపట్టడానికి అడ్డురాని వయసు జైలుకెళ్లడానికి అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పూణెలో తీగ లాగితే అమరావతిలోని కొంప కదిలిందని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాన్ని నిజం చేయడంలో దిట్ట అన్నారు.
* స్కిల్ స్కామ్ లో ఒక గజ దొంగల ముఠా ఏర్పడిందని మండిపడ్డారు ఎమ్మెల్యే కన్నబాబు. పథకము ప్రకారం కుట్ర జరిగిందన్నారు. గత ప్రభుత్వంలోనే ACBకి ఫిర్యాదులు అందాయన్నారు. చంద్రబాబు చేసిన స్కామ్ కంచికి చేరిపోయిందని విమర్శించారు.
* ప్రధాని, కేంద్రహోంమంత్రికి కేశినేని నాని లేఖ రాశారు. జీ20 సమావేశాలు ముగిశాక నేరుగా వెళ్లి కలుస్తానన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అవినీతి మచ్చలేని నేతల్లో చంద్రబాబు ఒకరని చెప్పారు. నేడు దేశ చరిత్రలో చీకటి రోజు అని అభివర్ణించారు.
* చంద్రబాబు అరెస్టులో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు బీజేపీ నేత సిఎం రమేష్. నోటీసులు ఇవ్వకుండా.. అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్యేనన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలన్నారు.
* ఈ కేసు నిలబడేది కాదని.. 5 నెలల్లో జగన్ పరిపాలన ముగుస్తుందన్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. చంద్రబాబు అరెస్ట్‌తో శునకానందం పొందుతున్నారని విమర్శించారు. ఎంపీ రఘురామను హింసించినట్టే చంద్రబాబును హింసిస్తారని అనుమానంగా ఉందన్నారు. లండన్ నుంచి జగన్ రాక్షస క్రీడ నడిపిస్తున్నారని చెప్పారు.
* చంద్రబాబు అరెస్ట్ ఏపీకి శుభ పరిణామం అన్నారు మంత్రి జోగి రమేష్. డొల్ల కంపెనీలతో హవాలా రూపంలో చంద్రబాబు డబ్బులను కాజేశారని ఆరోపించారు. స్కిల్ స్కాంలో ప్రజాధనాన్ని దోచేశారని మండిపడ్డారు జోగి రమేష్.
* చంద్రబాబు పాపం పండింది కాబట్టే అరెస్టయ్యారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏలేరు, లిక్కర్ స్కాంలో స్టే తెచ్చుకున్నారని చెప్పారాయన. స్టేలపై చంద్రబాబు బతుకుతున్నాడన్నారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయని.. ఒక శిక్ష తర్వాత మరో శిక్ష అనుభవించడం ఖాయమన్నారు మంత్రి.
* చంద్రబాబుది అక్రమ అరెస్టు కాదని.. అనివార్యమైన అరెస్టన్నారు మంత్రి అంబటి. అరెస్టుతో చంద్రబాబు సానుభూతి పొందే ప్రయత్నం చేసినా.. అది సాధ్యం కాదన్నారు. ప్రజాధనాన్ని జేబులో వేసుకోవడానికి యత్నించడం వల్లే అరెస్టు చేశారన్నారు.
* చంద్రబాబును కలిసేందుకు విజయవాడ బయలుదేరారు లోకేష్. కోనసీమ జిల్లా పొదలాడ యాత్రలో ఉన్న ఆయన చంద్రబాబు అరెస్టుపై రగిలిపోయారు. పోలీసుల అడ్డగింతపై ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించారు. ఓ కుటుంబసభ్యుడిగా బాబును కలిసే హక్కును కాలరాస్తారా అంటూ నిలదీశారు.
* విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు నారా భువనేశ్వరి. తన బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించుకున్నానని చెప్పారు. చంద్రబాబును రక్షించాలని కోరుకున్నానని అన్నారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నారని, ఆయన పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి భువనేశ్వరి కోరారు.
* చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అన్నారు నందమూరి రామకృష్ణ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి ఏపీని నెంబర్‌వన్‌గా నిలుపుదామని పిలుపునిచ్చారు.
* ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రొత్సహిస్తుందన్నారు. వైసీపీ నేతలు అక్రమాలు చేస్తే తప్పు లేనప్పడు.. విపక్షాలు బయటకు రాకూడదా అంటూ ప్రశ్నించారు. బాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనన్నారు.
* చంద్రబాబును ఎలాగైనా జైళ్లో పెట్టాలన్న కుట్రతోనే అరెస్టు చేశారన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. సంక్షేమాన్ని గాలికొదిలి…ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడబోమని.. న్యాయపోరాటం చేసి ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు బాలయ్య.
* చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. నోటీసులు, FIRలో పేరు చేర్చకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పోలీసుల తీరు సరిగా లేదన్నారామె.
* చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఆ పార్టీ నేత కందుల దుర్గేష్. కోర్టులో మెమో వేయకుండా కేసులో 37వ నిందితుడిగా ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి షెల్ కంపెనీలు, సూట్‌కేస్ కంపెనీలు పరిచయం చేసిందే వైసీపీ అన్నారు.
* చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో బంద్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు, రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
* చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ దగ్గర బైఠాయించి టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
