Pawan Kalyan: ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది.. పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
Pawan Kalyan steps into Vijayawada: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తొలిసారి ఆయన పార్టీ ఆఫీస్‌కు వచ్చారు. ఇటీవల కరోనాతో మరణించిన వారికి నివాళులర్పించారు. ఇటీవల నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్‌ను అందచేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించారు పవన్ కల్యాణ్.
గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌కే పరిమితమైన పవన్ కల్యాణ్.. ఇక క్రియాశీలక రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నిరసన కార్యక్రమాలతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించారు. భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దండయాత్ర చేయడానికి సమాయాత్తమవుదామని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జన సైనికులను కోల్పోయామన్న పవన్.. వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుందన్న పవన్.. ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు.
బ్లాక్ షర్ట్‌తో పవన్ కల్యాణ్..
పవన్ కల్యాణ్ నల్లరంగు దుస్తులను ధరించడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ నుంచి పవన్ కల్యాణ్.. కాస్త డిఫరెంట్ లుక్‌తో కనిపించారు. బ్లాక్ షర్ట్‌తో దర్శనమిచ్చారు. పవన్ కల్యాణ్ నల్లరంగు జుబ్బాను ధరించిన సందర్భాలు చాలా తక్కువ. నిరసన తెలియజేయడానికి ఈ రంగు దుస్తులను ధరిస్తుంటారు నాయకులు. చేతికి రిబ్బన్లను కట్టుకుని నిరసన ప్రదర్శనలను చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ దాన్ని ధరించలేదాయన. సాధారణంగా పవన్ కల్యాణ్ తెలుపు లేదా లేత, ముదురు నీలం రంగు దుస్తులతో కనిపిస్తుంటారు. ఈ సారి దానికి భిన్నంగా నల్లరంగు జుబ్బాను ధరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.Read Also… Cabinet Expansion: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ముస్తాబవుతున్న రాష్ట్రపతి భవన్