Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లో ప్రచారానికి ప్రియాంక.. లేటుగా వచ్చినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్!

Priyanka Gandhi: ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఈ ఎన్నికలకు సరిగ్గా ఆరునెలల సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు అక్కడ పోరాటానికి తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లో ప్రచారానికి ప్రియాంక.. లేటుగా వచ్చినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్!
Priyanka Gandhi
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 14, 2021 | 1:42 PM

Priyanka Gandhi: ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఈ ఎన్నికలకు సరిగ్గా ఆరునెలల సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు అక్కడ పోరాటానికి తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. సహజంగానే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈ ప్రచార పర్వానికి వేగంగానే తెరలేపింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉండాల్సిన కాంగ్రెస్ మాత్రం ఇప్పుడిప్పుడే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ప్రచార విషయంలో వేనుకడుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16 వ తేదీ నుంచి దూకుడు పెంచే సూచనలు ఉన్నాయి. ఆరోజు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ఉత్తర ప్రదేశ్ లో పర్యటనకు రానున్నారు. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ప్రచారం లేటుగా ప్రారంభిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంకను అధిష్టానం ప్రకటించే అవకాశాలున్నాయని అక్కడి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆమె చరిష్మా తో పూర్వవైభవం కాంగ్రెస్ కు వస్తుందనే ఆశలు వారిలో చాలా కనిపిస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి రెండు ఆశలు ఉన్నాయి. ఒకటి ప్రియాంక ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుకు తేవడం. రెండోది ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉండటం. గతంలో ప్రశాంత్ కిషోర్ ఒకసారి కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే, అప్పుడు ప్రియాంక తెరవెనుక ఉండిపోయారు. యూపీ ఎన్నికల్లో 2017లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయడంతోనే సరిపెట్టారు. ఆ ఎన్నికల్లో సమాజ్ వాడి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ షీలా దీక్షిత్ ను తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకుంది. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి ప్రియాంకను చాలా ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తీసుకువచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క సోనియాగాంధీ మినహా రాహుల్ గాంధీ సహా మిగిలిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తరువాత చాలా కాలం ప్రియాంక యూపీ మొహం చూడలేదు. కానీ, రెండేళ్ల క్రితం గిరిజనుల హత్య తర్వాత సోన్‌భద్రకు వెళ్ళారు. ఆ తరువాత మళ్లీ పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనల్లో గాయపడిన వారిని కలవడానికి ఆమె డిసెంబర్ 2019 లో లక్నోలో చివరిసారిగా పర్యటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పశ్చిమ యూపీలో ఆమె చేసిన కిసాన్ మహాపాంచాయతీల శ్రేణితో పాటు ఫిబ్రవరిలో ప్రయాగ్రాజ్‌లో జరిపిన సుడిగాలి పర్యటనలు తప్ప ఆమె ఉత్తరప్రదేశ్ లో ఎక్కడా కనిపించలేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కాంగ్రెస్ కు బలమైన కంచుకోటగా చెప్పుకునే రాయ్ బరేలీ లో కూడా పార్టీ ప్రదర్శన నిరాశాజనకంగా సాగింది.

ఇటువంటి విషమ పరిస్థితిలో ప్రియాంక ఉత్తర ప్రదేశ్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుందని యూపీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి స్థానిక నాయకులు ప్రియాంక ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకుంటున్నా.. ఇప్పటివరకూ అటువంటి ఆలోచన ఉన్న విషయం కాంగ్రెస్ అధిష్టానం నుంచి బయటకు రాలేదు. మరి ఇప్పుడు ప్రియాంక ప్రచారం ప్రారంభించాకా ఈ విషయంపై ఒక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సి ఉంది.

Also Read: Prashant Kishor: రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ.. కీలక మంతనాలు

పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు ‘ఆప్’ తో ‘మిలాఖత్’ ? ఓల్డ్ వీడియో క్లిప్ తో పార్టీకి షాక్ !