INTERESTING POLITICS: ఆసక్తి రేకెత్తిస్తున్న బీజేపీ వ్యూహం.. అటు బాబుతో సైడ్ మీటింగ్.. ఇటు జగన్‌తో లంచ్ మీటింగ్.. మర్మమేంటి మోదీజీ?

చంద్రబాబుని ఆప్యాయంగా పలకరించి.. ‘‘ మీతో చాలా మాట్లాడాలి.. మళ్ళీ కలుద్దాం ’’ అన్న నరేంద్ర మోదీ.. ఆ మర్నాడే సీఎం జగన్‌తో కలిసి భోం చేయడం.. బీజేపీయేతర సీఎంలలో జగన్‌కే ప్రాధాన్యతనివ్వడం పలు సందేహాలకు, మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది.

INTERESTING POLITICS: ఆసక్తి రేకెత్తిస్తున్న బీజేపీ వ్యూహం.. అటు బాబుతో సైడ్ మీటింగ్.. ఇటు జగన్‌తో లంచ్ మీటింగ్.. మర్మమేంటి మోదీజీ?
PM Modi With AP Politicians
Follow us

|

Updated on: Aug 08, 2022 | 8:51 PM

INTERESTING POLITICS BETWEEN BJP TDP YSRCP: ఎన్నికలిప్పుడపుడే లేవు. కానీ ఏపీ(Andhra pradesh)లో రాజకీయ పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇందుకు ఆగస్ట్ 6,7 తేదీలలో న్యూఢిల్లీ వేదికగా చోటుచేసుకున్న రెండు పరిణామాలు కారణమయ్యాయి. ఈ పరిణామాలే ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఇప్పుడు ఏపీలో రాజకీయం ఏ రంగు మార్చుకుంటుందా అనే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆప్యాయంగా మాట్లాడుకోవడమే పొలిటిక్‌ హీట్‌ పుట్టించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్(Azadi ka Amrit Mahotsav) సన్నాహక సమావేశంలో ఇది ఆగస్టు అయిదో తేదీన జరిగింది. గత నాలుగైదేళ్ళుగా రాజకీయ ప్రత్యర్థులుగా వున్న మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు. మళ్ళీ కలుద్దామంటే ఓకే ఓకే అనేసుకున్నారు. ఇది జరిగిన మర్నాడే అదే నరేంద్ర మోదీ.. ఏపీ సీఎం జగన్‌(CM jagan)కు పెద్దపీట వేస్తూ కలిసి భోం చేశారు. దాంతో మోదీ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. అటు చంద్రబాబుని ఆప్యాయంగా పలకరించి.. ‘‘ మీతో చాలా మాట్లాడాలి.. మళ్ళీ కలుద్దాం ’’ అన్న నరేంద్ర మోదీ.. ఆ మర్నాడే సీఎం జగన్‌తో కలిసి భోం చేయడం.. బీజేపీయేతర సీఎంలలో జగన్‌కే ప్రాధాన్యతనివ్వడం పలు సందేహాలకు, మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు, నరేంద్ర మోదీ కలిసి పయనించారు. తిరుపతి(Tirupati) సభలో వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ళ పాటు బీజేపీ (BJP), టీడీపీ(TDP) కలిసే వున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం తీసుకుంది. రెండు మంత్రి పదవులను దక్కించుకుంది. ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వని బీజేపీతో అంటకాగితే 2019 ఎన్నికల్లో బొక్క బోర్లా పడతానేమో అన్న అనుమానంతో బీజేపీకి దూరం కావాలని బాబు భావించారు. ఆ తర్వాతే ఏపీలో రాజకీయం రంగు మారింది. బీజేపీని పక్కన పెట్టేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బీజేపీపైనా, మరీ ముఖ్యంగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకో అడుగు ముందుకేసి చిరకాల ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఆనాటి ప్రయోగం బెడిసి కొట్టి దారుణంగా పరాజయంపాలైన చంద్రబాబు 2019 అనంతరం బీజేపీకి దగ్గరయ్యేందుకు, మోదీని కలిసేందుకు విఫలయత్నాలు చేశారన్న ప్రచారమూ వుంది. ఈక్రమంలో ఆగస్టు 5వ తేదీన ఆజాదీకా అమృత మహోత్సవ్ భేటీకి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం రావడం.. ఆయన వెళ్ళడంతో మోదీ ఆప్యాయంగా పలకరించి.. పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సైడు మీటింగ్‌పై సహజంగానే టీడీపీ వర్గాలు మీడియాకు తమదైన శైలిలో లీకులిచ్చి.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి. ఇక వైఎస్ జగన్ విషయంలో పరిస్థితి అందుకు భిన్నం. 2014 నుంచి 2017 దాకా టీడీపీతో పొత్తు వున్నప్పటికీ.. జగన్ విషయంలో నరేంద్ర మోదీ ఏనాడు దూరం పెట్టింది లేదు.. అలాగని అక్కున చేర్చుకున్నది లేదు. అయితే, 2019లో జగన్ సీఎం అయ్యాక మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట పలు అంశాల్లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులకు మద్దతిస్తూనే వున్నారు. విపక్షంలో వున్నప్పుడు 2017లోను, తాజాగా అధికారంలో వున్నపుడు 2022లోను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకే వైసీపీ మద్దతిచ్చింది. ఏపీలో బీజేపీ ఎదిగేందుకు యత్నిస్తున్న తరుణంలోను టీడీపీ, జనసేన వంటి విపక్షాలపై వైసీపీ విరుచుకుపడుతున్నా.. బీజేపీ విషయంలో అంతగా హార్డ్‌కోర్ అటాక్ ఏమీ చేయడం లేదు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి వీలైతే ప్రధాని మోదీని, లేకపోతే హోం మంత్రి అమిత్ షాని కలిసి వస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇదంతా ఒకెత్తయితే.. ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్‌లో జగన్‌కు మోదీ ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశమైంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో ఇద్దరికే మోదీ ప్రాధాన్యతనిచ్చారు. వీరిలో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాగా.. మరికొరు ఏపీ సీఎం వైఎస్ జగన్. మోదీ కోసం ఏర్పాటు చేసిన లంచ్ టేబుల్‌పైనే జగన్‌కు చోటివ్వడం.. ఆ తర్వాత కూడా ఇద్దరు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆసక్తి రేకెత్తించాయి.

2019 ఎన్నికలకు ముందు.. 2017లో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి, టీడీపీకి వ్యవహారం చెడిన తర్వాత మోదీ, చంద్రబాబు ఎదురుపడింది లేదు. మాట్లాడుకుందీ లేదు. అలాంటి దృశ్యం కనిపించనే లేదు. అక్షరాలా ఐదేళ్ల తర్వాత నరేంద్ర మోదీ, చంద్రబాబు ఒకేచోట కనిపించారు. ఒకేచోట కనిపించడం మాత్రమే కాదు.. మిగతా వాళ్లందరూ ఓ వైపు ఉంటే మోదీ, చంద్రబాబు మరోవైపునకు వెళ్లి ముచ్చటించడం అందరి చూపునూ వాళ్లవైపు తిప్పుకునేలా చేసింది. రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ సభకు చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం పంపింది. అక్కడే పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడారు మోదీ. ఇదంతా వార్తల్లో పెద్ద అంశం కాకపోయినా.. ఆ తర్వాత మోదీ, చంద్రబాబు నవ్వుకుంటూ ఓ పక్కకు వెళ్లి ముఖాముఖీ మాట్లాడుకోవడం మాత్రం హైలైట్ ఆఫ్ ది డేగా మారింది. చంద్రబాబునాయుడు కొన్ని నిమిషాల సమయం కావాలని ప్రధాని మోదీని కోరారు. ఆ తర్వాత ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ చంద్రబాబుతో పలకరింపుపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, జనసేనలతో రాజకీయ పొత్తును పునరుద్ధరించుకునేందుకు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు కథనాలు తీవ్రమయ్యాయి. మూడు పార్టీల పొత్తు ప్రాధాన్యతను జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సందర్భాలలో ఉటంకించారు. అయితే బీజేపీ రాష్ట్ర నేతల నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఏపీలోని రాజకీయ పరిస్థితులను, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మోదీకి చంద్రబాబునాయుడు వివరించే అవకాశాలున్నాయి. చంద్రబాబు ప్రధాని మోదీని కలవడం పట్ల పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ-బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలు పునరుద్ధరిస్తాయని, రెండు పార్టీలకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. మొత్తం మీద ఢీల్లీలో చంద్రబాబు మరోసారి హైలైట్ అయ్యారు. జనసేనాని ప్రతిపాదిస్తున్నట్లు ఏపీలో ప్రభుత్వ ఓటు చీలకుండా వుండేందుకు బీజేపీ, జనసేన, టీడీపీలు కలుస్తాయా అన్నదిపుడు ఆసక్తి రేపుతోంది. అయితే ఏపీలో ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఊహాగానాలు నిజమైతే 2023 తొలి భాగంలోను, తెలంగాణ మంత్రి కే.టీ.రామారావు చెప్పినదే నిజమైతే 2023 రెండో భాగంలోను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఖమ్మం,నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికీ ఎంతో కొంత టీడీపీ శ్రేణులు, ఓటు బ్యాంకు వున్నాయి. అదేసమయంలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బీజేపీకి అభ్యర్థులే లేరన్న అభిప్రాయం వుంది. ఈ తరుణంలో చంద్రబాబుతో బీజేపీ జతకడితే తెలంగాణలో ప్రయోజనం కలిగే అవకాశం వుందని, టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ వర్గాలు టీడీపీ-బీజేపీ కూటమి వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయిని ఓ విశ్లేషణ ప్రాచుర్యంలో వుంది. ఈ లాజిక్ ప్రకారం ముందుగా తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడడం ద్వారా ఆ తర్వాత జరిగే ఏపీ ఎన్నికల్లో పరస్పరం ప్రయోజనం పొందాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెప్పుకుంటున్నారు.

బీజేపీతో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలంగా సాగిస్తున్న పొత్తు ప్రయత్నాలను మోదీ, బాబు తదుపరి భేటీ ఓ కొలిక్కి తీసుకుని రావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. మోదీ, చంద్రబాబు ఇద్దరు కీలక నేతల పరస్పర పలకరింపు.. టీడీపీ, బీజేపీ మళ్లీ ఒక్కటవ్వబోతున్నాయా? అనే కొత్త చర్చ తెరమీదకొచ్చింది. చంద్రబాబును మళ్లీ చంకనెత్తుకునేందుకు కమలం పెద్దలు సిద్ధమయ్యారా? అనే గుసగుసలు మొదలయ్యాయి. ఏపీలో పొలిటికల్‌ పార్టీల మూడ్‌ మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక, టీడీపీ వైపు బీజేపీ అడుగులు వేస్తోందా…. అనే చర్చ జరగకుండా ఎలా ఉంటుంది.? రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు కారనేది మెజార్టీ వ్యక్తుల అభిప్రాయం. ప్రస్తుతం ఏపీలో కాషాయదళం… పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేనతో జతకట్టింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆజాదీకా మహోత్సవ్‌ జాతీయ మీటింగ్‌లో పాల్గొనేందుకు తమ మిత్ర పక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపకుండా చంద్రబాబుకు పంపడంలో ఆంతర్యమేంటనే ప్రశ్న ఇపుడు పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ లెక్కన టీడీపీని మళ్లీ దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టిందహో అంటూ… పొలిటికల్‌ కారిడార్‌ దండోరా కొట్టేస్తున్నారు కొందరు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీజేపీపై జగన్‌ ఇప్పటివరకూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది లేదు. మోదీ సైతం.. జగన్‌ను కలిసిన ప్రతీసారి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటీవల అల్లూరి విగ్రహావిష్కరణ మీటింగ్‌లోనూ, జగన్‌కు మోదీ ఇచ్చిన ప్రియారిటీ మామూలుదేమీ కాదు. అందుకే, వైసీపీ, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందమేదో కుదిరిందని.. రాజకీయ వర్గాల్లో చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. అయితే, ఆ అనుబంధాన్ని కాస్తా.. అఫీషియల్‌ చేసేసుకుందామని కాషాయ దళం భావిస్తోందా? అనే అనుమానాలు ఇప్పుడు తీవ్రరూపం దాల్చాయి. మోదీ ఇపుడు చంద్రబాబును దగ్గర చేసుకుంటారా ? లేక జగన్‌తో అవగాహనకే ప్రాధాన్యతనిస్తారా ? అన్న సందేహాలు పలువురిలో వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మోదీ ఇపుడు ఏ గెట్టునుంటారు ? అన్న చర్చ గల్లీ గల్లీలో జరుగుతోంది. మోదీ వ్యూహం ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ అంశం ఇప్పటికిప్పుడు తేలేలా లేదు. ఎందుకంటే అటు పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తోగానీ, ఇటు చంద్రబాబుతోగానీ డైరెక్టు అవగాహనకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్దంగా లేరు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ (Janasena Party)ల కలయిక నిక్కచ్చిగా సానుకూల ఫలితం ఇస్తుందన్న క్లారిటీ బీజేపీ అధిష్టానానికి కలిగితే మాత్రం తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలను ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈక్రమంలో ఈ సస్పెన్సును కమలదళం ఇంకా చాన్నాళ్ళే కొనసాగించే సంకేతాలు కనిపిస్తున్నాయి.