Indian Govt on Twitter: ప్రముఖుల బ్లూ టిక్ తొలగింపుపై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్!
భారత్‌లో ట్విటర్‌ను బ్యాన్ చేస్తారా ? ట్విటర్ ఎందుకు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తోంది ? ఈ విషయం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇదేక్రమంలో సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్ ఇచ్చింది కేంద్రం.
Indian Govt expresses displeasure on Twitter: భారత్‌లో ట్విటర్‌ను బ్యాన్ చేస్తారా ? ట్విటర్ ఎందుకు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తోంది ? ఈ విషయం ఎవరికి అంతుచిక్కడం లేదు. తమతో ఢీ అంటే ఢీ అంటున్న సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌కు ఆఖరి వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. తాజాగా మరోసారి కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం చెలరేగడమే ఇందుకు కారణం.
కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
సోషల్‌మీడియాలో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం కొత్త ఐటీ రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల కింద చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. . కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విటర్ ఇంకా వీటిని పాటించేందుకు ఒప్పుకోవడం లేదని కేంద్రం మండిపడింది.
దీంతో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఇవాళ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతో ట్విటర్ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ లాంటి ప్రముఖుల వ్యక్తిగత ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్‌ను శనివారం కాసేపు తొలగించి మళ్లీ యాడ్ చేయడంపై కూడా వివాదం చెలరేగింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది గంటలకే ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది.