AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లమల నట్టడవిలో గుప్త నిధుల వేట.. టూరిజం మాటున తవ్వకాలు జరుపుతున్నారని స్థానికుల ఆరోపణ

నల్లమల ఫారెస్ట్ అంటేనే నిధులు, నిక్షేపాలకు నిలయం. కృష్ణా నది పొడవునా విస్తరించి ఉన్న ప్రతాపరుద్రుడి కోట ఇక్కడ ప్రత్యేకం. అలాంటి అడవిలో..

నల్లమల నట్టడవిలో గుప్త నిధుల వేట.. టూరిజం మాటున తవ్వకాలు జరుపుతున్నారని స్థానికుల ఆరోపణ
K Sammaiah
|

Updated on: Feb 25, 2021 | 7:40 AM

Share

నల్లమల ఫారెస్ట్ అంటేనే నిధులు, నిక్షేపాలకు నిలయం. కృష్ణా నది పొడవునా విస్తరించి ఉన్న ప్రతాపరుద్రుడి కోట ఇక్కడ ప్రత్యేకం. అలాంటి అడవిలో ఇంకా గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నాయా..? టూరిజం పేరుతో నల్లమల గుప్తనిధుల వేట జరుగుతోందా..? నిధులు, నిక్షేపాలనున్న తెలుగు సంపదపై కన్నేశారా..? నల్లమల జంగల్లో అసలు ఏం జరుగుతోంది. స్థానికుల ఆరోపణల్లో నిజమెంత..?

దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలో నల్లమల అడవిలో ప్రతాపరుద్రుడి కోట ఉంది. 14వ శతాబ్ధంలో ప్రసిద్ది గాంచిన పురాతనమైన ఈ కట్టడం… కృష్ణానది పొడవునా దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కోటలోకి వెళ్లాలంటే కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రోడ్డు మార్గాన్ని నిర్మించారు అధికారులు.

అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే కఠిన నిబంధనలు ఉంటాయి. అటవీశాఖ అనుమతులు లేకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి నిబంధనలు తుంగలోతొక్కి కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టూరిజం పేరుతో స్థానిక అధికారులు కోట మరమ్మతులు చేపట్టారు. అభివృద్ధి ముసుగులో గుప్తనిధుల తవ్వకాలకు తెరలేపారు.

సహజంగా మేతకోసం అడవిలోకి పశువులు వెళ్తేనే అటవీశాఖ అధికారులు కేసులు పెడతారు. చివరకు స్థానికులు కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్లినా కేసులు, ఫైన్లు విధిస్తారు అటవీశాఖ అధికారులు. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే అధికారులకు కనిపించడం లేదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగం అంత కొందరు రాజకీయనాయకుల అండదండలతో జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్‌ సపోర్ట్‌తో గుప్తనిధులు స్వాహా చేసే కుట్ర జరుగుతోందని స్థానికులంటున్నారు.

నల్లమలకు గుప్తనిధుల తవ్వకాల గొడవ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు జరిగాయి. గుప్తనిధుల కోసం ఫారెస్ట్‌లోని దేవాలయాలు, విగ్రహాలు నేలమట్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో భౌరపూర్‌లో అమ్మవారి గుడిలో కూడా గుప్తనిధుల తొవ్వకాలు నిర్వహిస్తుండగా… స్థానికంగా ఉండే చెంచులు పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పటించారు. నల్లమలలో వజ్రాలు, బంగారం ఉన్నాయని అడుగడుగునా తవ్వకాలు ఎక్కడో ఒక చోట తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా, టూరిజం పనుల పేరుతో… గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టారని అంటున్నారు స్థానికులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more:

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఫిర్యాదులకు ఫోన్‌ నెంబర్లు ఇవే..