శ్రీవారి దర్శనంపై రాజకీయ రచ్చ… జోరుగా ట్వీట్ వార్
టీటీడీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వై.వి.సుబ్బారెడ్డి లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరమైన తిరుమలేశున్ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో వై.వి.సుబ్బారెడ్డి వైఖరిని ఎండగడుతూ...

టీటీడీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వై.వి.సుబ్బారెడ్డి లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరమైన తిరుమలేశున్ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో వై.వి.సుబ్బారెడ్డి వైఖరిని ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ చేసిన ట్వీట్లు రాజకీయ రగడను రాజేశాయి. అయితే టీటీడీ బోర్డు దర్శనాల ప్రోటోకాల్ ఏంటో చినబాబు తెలుసుకోవాలి అంటూ వైసీపీ నేతలు లోకేష్‌కు చురకలు అంటిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దాన్ని ఉటంకిస్తూ నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ‘‘ ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా.. నీకు పేద ధనిక తేడాలు లేవంటారు.. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు మీ దర్శన భాగ్యం లేదు.. కానీ వైఎస్ తోడల్లుడు కుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు తెరుచుకున్నాయి స్వామీ? ’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరో ట్వీట్ కూడా చేస్తూ.. ‘‘ నిర్మానుష్యంగా మారిన తిరుమల వీధుల్లో నిబంధనలు తుంగలో తొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా? నువ్వు ఉన్నావ్ అంటే నమ్ముతారా? నీకు నువ్వే కాపాడుకో స్వామి.. ’’ అంటూ కామెంట్ చేశారు లోకేష్. తన ట్వీట్‌లకు ఓ వీడియోను జోడిస్తూ అందులో వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీని ఉద్దేశించి కామెంట్లు పెట్టారు. అయితే తన ట్వీట్లో నేరుగా ఎక్కడ టీటీడీ చైర్మన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. కేవలం వైఎస్ తోడల్లుడు అనే పదాన్ని మాత్రమే వాడారు.
ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! (1/2) pic.twitter.com/y5WhI47l1r
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 2, 2020
లోకేష్ ట్వీట్‌పై టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి అదే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ ప్రతి శుక్రవారం శ్రీ వారికి జరిగే అభిషేకానికి ప్రతి రెండు వారాలకు ఒకసారి బోర్డు చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి హాజరు కావడం ఆనవాయితీ.. నేను అలాగే వెళ్ళాను.. నా తల్లి గారు, నా సతీమణి తప్ప బంధువులెవరు ఆ బృందంలో లేరు.. లోకేష్ ట్వీట్ చేసిన ఫోటోలో ఉన్నది టీటీడీ ఉద్యోగులు మాత్రమే.. నీకు కొంచమైనా ఉండాలి.. తప్పు తెలుసుకో..’’ అంటూ ట్వీట్ చేశారు సుబ్బారెడ్డి.
ఒక వైపు నారా లోకేష్ ట్వీట్‌లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ చేస్తూ ఉంటే.. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి ట్వీట్ ఆధారంగా వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్ స్వామివారి అభిషేక సేవకు హాజరవడం ఆనవాయితీ అని వారు గుర్తు చేస్తున్నారు అయితే అదే శుక్రవారం సుబ్బారెడ్డి పుట్టిన రోజు కావడం యాదృచ్చికం వారు అంటున్నారు. ఇదిలా ఉంటే తన పైన ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వై.వి.సుబ్బారెడ్డి హెచ్చరిస్తున్నారు.