పార్లమెంటులో విపక్షాల రభసతో రూ.133 కోట్లకు పైగా నష్టం.. ప్రభుత్వ వర్గాలు.. ఇది ప్రజాధనమేనని వ్యాఖ్య
పార్లమెంటులో ప్రతిపక్షాల రభస, సృష్టించిన గందరగోళం కారణంగా రూ. 133 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పెగాసస్ వివాదంపై చర్చ జరగాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టు బట్టాయని, అనేకసార్లు సభలు వాయిదా పడుతూ వచ్చాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
పార్లమెంటులో ప్రతిపక్షాల రభస, సృష్టించిన గందరగోళం కారణంగా రూ. 133 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పెగాసస్ వివాదంపై చర్చ జరగాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టు బట్టాయని, అనేకసార్లు సభలు వాయిదా పడుతూ వచ్చాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, సభలు హుందాగా, సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని ఈ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇన్ని కోట్ల నష్టం జరిగిందంటే ఇదంతా ప్రజాధనమే.. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మే.. ఇందుకు కారణం ప్రతిపక్షాలే అని ప్రభుత్వం విమర్శించింది. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఉభయ సభల్లో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తే సరిపోతుందని, అసలు ఇది సమస్యే కాదని బీజేపీ ప్రభుత్వం వారి డిమాండును తోసిపుచ్చింది. ముఖ్యంగా రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శంతను సేన్ ప్రవర్తించిన తీరు చాలా సహింపరానిదిగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఆయన ఐటీ శాఖ మంత్రి నుంచి పెగాసస్ సంబంధ పత్రాలను లాక్కుని చించి వేసి వాటిని డిప్యూటీ చైర్మన్ దిశగా విసరివేశారు. ఈ విధమైన చర్యలు పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
లోక్ సభ 54 గంటలు పని చేయవలసి ఉండగా సుమారు 7 గంటలు, రాజ్య సభ 53 గంటలు పని చేయాల్సి ఉండగా దాదాపు 11 గంటలు మాత్రమే పని చేసింది.. మొత్తం మీద 107 గంటలకు గాను పార్లమెంటు 18 గంటలు మాత్రమే పని చేసిందని, అంటే 89 గంటలు వృధా అయిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కనీసం ఇక మిగిలిన కాలానికైనా సభలు హుందాగా నడుస్తాయన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. పార్లమెంట్ వర్షా కాల సమావేశాలు ఈ నెల 13 తో ముగియవలసి ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సముద్రం అడుగున్న 8ఏళ్ల చిన్నారి.. ఏం చేస్తుందంటే..?? వీడియో