- Telugu News Photo Gallery World photos China to build dam on brahmaputra dragon might stir another conspiracy
China dam on Brahmaputra : దాయాది దేశాల్ని కలవరపెడుతున్న బ్రహ్మపుత్ర నదిపై డ్రాగన్ కంట్రీ డ్యామ్
China dam on Brahmaputra : టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడం భారత - చైనా దేశాల మధ్య కొత్త వివాదాలకు బీజం పడేలా చేస్తోంది.
Updated on: Mar 13, 2021 | 5:06 PM

టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడం భారత - చైనా దేశాల మధ్య కొత్త వివాదాలకు బీజం పడేలా చేస్తోంది.

చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదం తెలిపింది. కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది చైనా.

కాగా, చైనా చర్యలను ఇండియా, బంగ్లాదేశ్ తోపాటు, టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది.

పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది.

60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు.