- Telugu News Photo Gallery Sprouting Potatoes: Is It Safe to Eat Sprouted Potatoes? Here's What Experts Say
Sprouting Potatoes: బాబోయ్.. మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా? ఇకపై అలా చేయకండి
దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో బంగాళా దుంపలు ఉంటాయి. ఇవి త్వరగా పాడైపోవు.. ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని అవసరమైన దానికంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. అయితే కొన్ని రోజులకు బంగాళా దుంపలు మొలకెత్తుతుంటాయి. వీటిని తొలగించి వంటకు ఉపయోగిస్తుంటారు చాలా మంది.. ఇలా చేయడం చాలా డేంజర్ అట..
Updated on: Oct 28, 2024 | 12:43 PM

ఆలుగడ్డల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీన్ని నూనెలో వేయించి తినొద్దు. ఉడకబెట్టి తీసుకోవడం మంచిది. బంగాళదుంపలతో వివిధ వంటకాలను తయారు చేయవచ్చు. బంగాళదుంపలను సాంబార్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు ఉపయోగిస్తారు.

బంగాళదుంపలను మార్కెట్ నుండి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. బంగాళదుంపలు కొని ఇంటికి తెచ్చిన తర్వాత వెంటనే వాడకపోతే కొన్ని రోజులకు మొలకెత్తుతాయి. అయితే చాలా మంది ఈ మొలకలను తొలగించి వంటల్లో వాడుతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన డాక్టర్ దీపక్ ఆరాధ్య మాత్రం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

అవును, మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన లేదా లేత ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. ఇది వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి కారణమవుతాయి.

అంతేకాకుండా ఇది తలనొప్పి, తల తిరగడం వంటి నరాల సంబంధిత లక్షణాలను కూడా కలిగిస్తుందని డాక్టర్ దీపక్ చెబుతున్నారు.

కాబట్టి ఇకపై ఇంట్లో నిల్వ ఉన్న బంగాళా దుంపలను వంట చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాడటం మంచిది. లేదంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి.




