- Telugu News Photo Gallery Spiritual photos Varalakshmi vratam 2024: date time significance varalakshmi vratam puja know the total details
Varalakshmi Vratam 2024: అష్టైశ్వర్యాలు, సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం పూజా విధానం మీ కోసం
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఫుల్ బిజీ.. హిందువుల ప్రతి ఇల్లు పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శ్రావణ మాసం ప్రతి రోజూ పూజలను చేస్తారు. అయితే శ్రావణ సోమవారం శివయ్య పూజను, మంగళవారం మంగళ గౌరీ పూజను, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి పూజను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విసిష్టమైనదే.. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వచ్చింది. సనాతన హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది. సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవిని భక్తీ శ్రద్ధలతో పుజిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో సిరి సంపదలు కలుగుతాయని జీవితంలో డబ్బులకు లోటు ఉండదని విశ్వాసం.
Updated on: Aug 02, 2024 | 7:52 AM

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందట. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీ మహా విష్ణువుకి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట. అంతేకాదు వరలక్ష్మి అమ్మవారి పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుస్సుని ఇస్తుందని విశ్వాసం. ఈ నేపధ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు. ఈ రోజు పూజా విధానం తెలుసుకుందాం..

వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముంగిలి ముందు ముగ్గులు పెట్టి.. గుమ్మానికి తోరణాలుగా మామిడి ఆకులు కట్టుకోవాలి. ఇష్టమైన వారు బంతిపూల దండలతో కూడా ఇంటి గుమ్మాలను అందంగా అలంకరిచుకోవచ్చు. పూజ సామాగ్రిని చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే ఇంటికి పండగ వాతావరణం వచ్చేస్తుంది.

శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత వ్రత మండపాన్ని రెడీ చేసుకోవాలి. ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి. తర్వాత వరిపిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోవాలి. మండపాన్ని మామిడాకులతో, పువ్వుల దండతో అలంకరించాలి. ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి.

ఇప్పుడు వరలక్ష్మి దేవి పూజ కోసం రెడీ చెయ్యాలి. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందు కోసం వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏ లోహంతో చేసిన కలశాన్ని తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి. అందులో బియ్యం పోసి మావి చివుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరి కాయను కలశంలోని మావి చివుల్లపై పెట్టాలి. ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ ను తీసుకుని దానిని కొబ్బరి కాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించాలి. ఇప్పుడు పువ్వు పెట్టి ఆ కలశం దగ్గర కుర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

పూజ చేయడానికి ముందు దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ముందుగా విఘ్నలకధిపతి వినాయకుడిని పూజించాలి.

Varalakshmi Vratam

ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి. ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయినం అందించాలి. కొబ్బరి ముక్కలు కలిపిన నాన బెట్టిన శనగలు, తమలపాకులు, రెండు అరటి పండ్లు, పసుపు , కుంకుమ, జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: వాయన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అని.. అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఎవరికైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలుకాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు.





























