- Telugu News Photo Gallery Spiritual photos Telangana: Adilabad Tribal people celebrates Diwali festival Dandari Gussadi for 15 days
Dandari Festival: దండారీ పండగకు రెడీ అవుతున్న ఆదివాసీలు.. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతల గుస్సాడీల ఆటపాట
దసరా వచ్చింది దశనే మార్చనుంది. దసరాలోగా టికెట్ల ప్రకటన ఖరారైతే ఇక ఎన్నికల ప్రచార బరిలోకి దూకడమే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ లోని ప్రతిపక్ష పార్టీ నేతల మనసులో మాట. వరుస పండుగలకు ఎన్నికల తోడవడంతో ఈసారి ఆదివాసీల ఖిల్లాలో అందరి చూపు ఆ ఆదివాసీ బిడ్డల మీదే పడింది. వారి ఓట్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఈ పండుగల సమయంలో వారి ఆటపాటా.. సంస్కృతి సంప్రదాయాలకు అంతకంటే ప్రాముఖ్యత ఉంది. సో ఈ సమయంలో గిరిజన బిడ్డలను ఎంత ఆప్యాయంగా పలకరిస్తే అన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయని భావిస్తున్నారు నేతలు.
Naresh Gollana | Edited By: Surya Kala
Updated on: Oct 21, 2023 | 11:58 AM

అసలు సిసలైన ఎన్నికల హోరు మొదలయ్యే సమయానికి దీపావళి పండుగ రానుండటం.. ఆ దివాళి పండుగ ఆదివాసీ గూడాల్లో అంబరానంటేలా సాగే దండారి పండుగ శుభసమయం కావడంతో ఓటర్లను కలుసుకునేందుకు ఓట్ల వర్షం కురిపించుకునేందుకు జై ఆదివాసీ జై దండారీ అంటూ సాగబోతున్నారు ఎన్నికల బరిలో నిలవబోతున్న నేతలు. ఎన్నికల సీజన్ కావడంతో రాబోయే దండారి పండుగను క్యాచ్ చేసుకుని ఆదివాసీల ఆశీస్సులు పొంది ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎక్కడ ర్యాలీలు జరిగినా.. నేతల పాదయాత్రలు కొనసాగినా ఆదివాసీ తుడుం మోగడం ఆనవాయితీగా మారింది. ఎన్నికల పండుగ కావడంతో ఈ సారి దండారి పండుగ దండిగా జరిపించేందుకు సొంత ఖర్చులతో నేతలు గిరి గూడాల వైపు సాగుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో గుస్సాడి నృత్యాల తో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దండారీ పండుగ ఆదివాసీ గూడాల్లో అంబరంగా సాగే పండుగ కావడంతో ఓట్ల పండుగ వేళ గ్రామ పటేళ్లను తమ వైపు తిప్పుకుని భారీ ఎత్తిన ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని పక్కా వ్యూహంతో కదన రంగంలోకి దూకుతున్నారు నేతలు.

ఉమ్మడి ఆదిలాబాద్ లో ముఖ్యంగా బోథ్ , ఖానాపూర్ , ఆసిపాబాద్ నియోజక వర్గాల్లో ఆదివాసీలదే ఆదిపత్యం కావడంతో వారి ఓట్లను ఎంత ఎక్కువ రాబట్టుకుంటే విజయానికి అంత చేరువ అవుతామనే ఆలోచనలో ఆదివాసీ నేతలతో పాటు లంబాడా సామాజిక వర్గ నేతలు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మూడు ఎస్టీ నియోజక వర్గాలతో పాటు.. ఆదివాసీ ఓట్లు బలంగా ఉన్న ఆదిలాబాద్ , సిర్పూర్ నియోజకవర్గాల్లోను నేతలు దండారి పైనే దండిగా ఆశలు పెట్టుకున్నారు.

మరీ ఈ దండారి పండుగ ఏ నేత దశ మారుస్తుందో చూడాలి. దీపావళి కి వారం రోజుల ముందు ప్రారంభం అయ్యే ఈ పండుగ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రారంభం అవుతుండటం.. నామినేషన్ పర్వానికి గుస్సాడీలతో భారీ ర్యాలీలకు ప్లాన్ చేస్తుండటంతో ఈసారి దండారి శోభ మరింత జోరుగా సాగనుంది.

ఇంతకీ దండారి పండుగ విశిష్టతలేంటో ఓ సారి చూద్దాం. దండారి.. ఆదివాసీ గూడాల్లో దీపావళి పండుగకు ముందు జరుపుకునే రెండు వారాల పండుగ. అత్యంత భక్తి శ్రద్దలతో సాగే వేడుక. దండారి ఉత్సవాల్లో అకాడి రోజుకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, పెట్టె అనే వాయిద్యాలను బయటకు తీసి అలంకరిస్తారు ఆదివాసీలు. గుస్సాడీ అలంకరణ మరింత అద్భుతం.. గుస్సాడీ వేషదారణలో కీలకం ముఖానికి పెట్టుకునే ఉప్పల్, కోడల్ కవచాలు, కంకాలి టోపీలు, ఆభరణాలు, మంత్రదండం, మెడలో రుద్రాక్షలు, రోకళ్లు.. వీటన్నింటికి సామూహికంగా పూజ చేసి... తుడుం మోగించి సంబరాలను ప్రారంభిస్తారు ఆదివాసీలు.

వీటన్నింటి నైవేధ్యం సమర్పించడంతో దండారీ వేడుకలు మొదలవుతాయి. ఒక ఊరి నుండి దండారి బృందం రెండు, మూడు ఊళ్లకు విడిదికి వెళ్లడం ఆనవాయితీ. తెల్లని ధోతులు, నడుము.. తలకూ తెల్లని రుమాలు.. ఎరుపు, ఆకుపచ్చ రంగుల పట్కాలు కట్టుకొని... కోలలు పట్టుకొని నృత్యాలు చేస్తారు గుస్సాడీలు.

దండారి వేడుకల్లో గుస్సాడీ నృత్యాలకు ప్రత్యేకత ఉంది. నెత్తిన నెమలి ఈకలతో టోపీలు, చేతిలో మంత్ర దండం, మెడలో రుద్రాక్ష మాలలు, కాళ్ళకు, నడుముకు గజ్జెలు, ముఖానికి విభూతి, నల్లటి, తెల్లటి చారలతో గీతలు... గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలు, భుజాన జింక చర్మం... ఇలా ప్రత్యేక ఆకర్షణగా కనబడతాయి గుస్సాడీ వేషాలు. కోరికలు నెరవేరాలని గూడెం యువకులు గుస్సాడి వేషాలు వేయడం తరతరాల సంప్రదాయం. పది రోజులు నియమనిష్ఠలతో దండారి సంబురాల్లో పాల్గొంటారు గుస్సాడీలు.

దీక్షతో ఉన్న గుస్సాడీలు పది రోజులు స్నానం చేయరు.. కట్టిన బట్టలు విడవకుండా, నేలపైనే పడుకుంటూ.. దీక్షలు కొనసాగిస్తారు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఆదివాసీల అపార నమ్మకం. గుస్సాడీల చేతిలో ఉండే మంత్రదండాన్ని తాకిస్తే రోగాలు పోతాయని ఆదివాసీలు నమ్ముతుంటారు. ఇప్పుడీ గుస్సాడీల ఆటపాట ఎన్నికల పండుగలో నేతలకు ఓట్లు లార్చే దండంగా కూడా.

దీపావళి అమావాస్య మరుసటి రోజు జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సారి ఈ ఉత్సవాలు ఎన్నికల పండుగ వేళ రావడంతో నేతలు ఆదివాసీ గుస్సాడీల ఆశీస్సుల కోసం అన్నీ ప్రయత్నాలు చేసేందుకు సిద్దం అంటున్నారు. చూడాలి దండారీ దండం ఏ నేత గండాన్ని దూరం చేసి ఎమ్మెల్యే గా మారుస్తుందో.





























