- Telugu News Photo Gallery Spiritual photos Srivari Brahmotsavam 2022, third day morning with Simha vahanam in Yoga Narasimha Alankaram and blessed the devotees
Srivari Brahmotsavam: యోగ నరసింహునిగా సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు.. దర్శనంతో సోమరితనం నశించి శక్తివంతమవుతారని నమ్మకం..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభంవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు యోగ నృసింహుడిగా సింహ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
Updated on: Sep 29, 2022 | 1:05 PM

స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.

యోగ శాస్త్రంలో వాహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి సింహం ఆదర్శం. విష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః స్తోత్రం ఉంటుంది.

సింహ రూప దర్శనంతో ఆ శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సింహ బలమంత స్వామివారిపై భక్తి బలం కలిగి ఉన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం

సింహ వాహనోత్సవంలో పాల్గొన్నవారికి సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు వెళ్తే విజయస్ఫూర్తి సిద్ధిస్తుందని నమ్మకం.

ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సింహ వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

ఈరోజు రాత్రి శ్రీవారు తన ఉభయ దేవేరులతో కలిసి.. భోగశ్రీనివాసునిగా తిరుమల వీధుల్లో ముత్యాలపందిరి వాహనంపై ఊరేగుతారు.

చల్లదనానికి చిహ్నమైన ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు దర్శించుకుంటే.. మనసు నిర్మలమవుతుందని భక్తుల నమ్మకం.





























