- Telugu News Photo Gallery Spiritual photos Significance of kamakshi deepam kamatchi vilakku in hinduism
Kamakshi Deepam: మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షిదీపం అంటే ఏమిటి.. ఎలా పెట్టాలంటే
Kamakshi Deepam: హిందూ సంస్కృతిలో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపం భావించి పూజిస్తుంటాం. దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి దేవుని ముందు వెలిగిస్తారు. దీపంలో కామాక్షి దీపానికి విశిష్ట స్థానం ఉంది. ఈరోజు కామాక్షి దీపం అంటే ఏమిటి..? ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..
Updated on: Aug 02, 2021 | 8:46 AM

దీపపు ప్రమిదకు వెనుక గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు. కొన్ని ప్రాంతాల్లో గజ దీపం అని కూడా పిలుస్తారు. ఈ విధమైన దీపాన్ని వెలిగిస్తే.. ఆ వెలుగులో కామాక్షి అమ్మవారు వెలుగుని ఇస్తూ ఉంటారు.

కామాక్షి దేవి స్వర్వదేవతలకు శక్తిని ప్రసాదిస్తుందని పురాణాల కథనం. అందుకనే అన్ని ఆలయాలకంటే ముందుగా కామాక్షిదేవి ఆలయాన్ని తెరచి.. దేవికి పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు.. ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు.

ఈ కామాక్షీ అమ్మవారి దీపాన్ని చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు. హిందువుల ఇళ్ళలోని కొన్ని వంశాలవారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తారు. అంతే కాకుండా ఇంట్లో చేసే విశేష వ్రతాలూ పూజలను ఆచరించే సమయంలో అఖండ దీపముగా కొందరు ఈ కామాక్షీదీపం వెలిగిస్తారు.

అయితే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అన్ని దీపాలను వెలిగించినట్లు కాకుండా కొన్ని నియమనిష్టలతో వెలిగించాలి. ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. అదే విధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి.

కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమిరోజు ఈ దీపాన్ని కుల దేవత యంత్రం పై ఉంచి వెలిగించడం సాంప్రదాయం. ఇలా కామాక్షీ దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో.. ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో, అమ్మ కృపతో నిండి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నారు.




