- Telugu News Photo Gallery Spiritual photos Saturn Rahu Conjunction in Pisces: Lucky Zodiac Signs details in telugu
Lucky Zodiac Signs: శని రాహువుల యుతి.. ఆ రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి
జ్యోతిషశాస్త్రం ప్రకారం పరమ పాప గ్రహాలుగా గుర్తింపు పొందిన శని, రాహువులు సాధారణంగా ఏ రాశిలో కలిసినా కష్టనష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. మార్చి 29 నుంచి మే 18 వరకు సుమారు 50 రోజుల పాటు మీన రాశిలో కలిసి ఉండబోతున్న ఈ శని రాహువుల వల్ల కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మరో ఆరేడేళ్ల పాటు బలమైన ఆర్థిక పునాదులు పడే అవకాశం ఉంది. ప్రతి రాశిలోనూ సుదీర్ఘకాలం ఉండే ఈ రెండు గ్రహాల ఫలితాలు కూడా సుదీర్ఘకాలం ప్రభావం కలిగిస్తాయి. వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ అరుదైన కలయిక వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
Updated on: Feb 28, 2025 | 7:16 PM

వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థానంలో రాహువుతో యుతి చెందడం వల్ల, ఈ రాశివారి అదృష్టానికి తిరుగుండదు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఇదివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు మీ అభిమానులవుతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలుసుకోవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి కోలుకుని అభివృద్ది బాటపడతాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని రాహువుల యుతి జరగడం వల్ల అనేక శుభాలు జరిగే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో పాప గ్రహాలు ఉండడం వల్ల తప్పకుండా అదృష్టం పండుతుంది. ఆర్థిక, ఆదాయ, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

వృశ్చికం: శని మీన రాశిలో ప్రవేశించిన నాటి నుంచి ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. పంచమ స్థానంలో శని రాహువులు కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు అందే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడితో రాహువు కలవడం వల్ల ఏ రంగంలో ఉన్న వారికైనా ఊహించని పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో హోదాలు పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు రాబడి కూడా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.



