- Telugu News Photo Gallery Spiritual photos Rare Planetary Conjunction: Thease Zodiac Signs to Gain Wealth and Luck Telugu Astrology
Money Astrology: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారి ఇళ్లలోకి ధన ప్రవాహం!
ఈ నెల (నవంబర్) 20, 21, 22 తేదీల్లో వృశ్చిక రాశిలో రవి, చంద్ర, కుజ, బుధ గ్రహాలు యుతి చెందుతున్నాయి. వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అయినప్పటికీ, రాశ్యధిపతి కుజుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల చంద్రుడికి నీచభంగం జరిగింది. ఈ నాలుగు గ్రహాల కలయికను ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఈ అరుదైన గ్రహ యుతి కారణంగా వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి ఇళ్లలోకి ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను చేపట్టడానికి ఆ మూడు రోజులు చాలా అనుకూలమైన రోజులు.
Updated on: Nov 15, 2025 | 5:26 PM

వృషభం: ఈ రాశికి సప్తమంలో కలుస్తున్న కుజ, రవి, బుధ, చంద్ర గ్రహాలను ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి అంచనాలను మించి వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో చోటు చేసుకున్న నాలుగు గ్రహాల యుతిని ఇదే రాశి నుంచి ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు, భాగ్య యోగాలు కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, కుటుంబంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ, బుధ, రవి, చంద్రులు కలవడంతో పాటు, ఈ కలయికను ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అతి సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబపరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి.

వృశ్చికం: ఈ రాశిలో సంచారం చేస్తున్న నాలుగు రాజయోగ గ్రహాలను ధన కారకుడు గురువు ఉచ్ఛస్థితి నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొంత అప్రయత్నంగానూ, కొంత ప్రయత్నపూర్వకంగానూ ధన యోగాలు, రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలపరంగా అదృష్టం వీరి తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి తప్పకుండా లాభిస్తాయి.

మకరం: ఈ రాశికి లాభ స్థానంలో నాలుగు గ్రహాలు యుతిచెందడం ఒక విశేషం కాగా, వాటిని సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టిన గురువు వీక్షించడం మరో విశేషం. దీనివల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది.

మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం, ఆ కలయికను పంచమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారి వైభవానికి నెల రోజుల పాటు పట్టపగ్గాలుండవు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదురుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.



