- Telugu News Photo Gallery Spiritual photos Rahu Guru Transit May 2025: Money luck for these Zodiac Signs details in telugu
Money Astrology: రాహువుపై గురు దృష్టి.. ఆ రాశుల వారికి ధన యోగాలు..!
ఈ నెల(మే) 18న కుంభ రాశిలో ప్రవేశించిన రాహువు మీద ఈ నెల 25 న మిథున రాశిలో ప్రవేశిస్తున్న గురువు దృష్టి పడుతుంది. ఇది రాహువు పాపత్వాన్ని చాలా వరకు మార్చేసే అవకాశం ఉంది. అశుభ ఫలితాలను అనుభవించాల్సిన రాశులు చాలావరకు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. రాహువు దుస్థానాల్లో ప్రవేశిస్తున్నందువల్ల వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే గురువు వీక్షణ కారణంగా ఈ రాశుల వారు కొద్దిగా శుభ ఫలితాలను కూడా అనుభవించడం జరుగుతుంది. గురువు మిథున రాశిలో ఉన్నంత కాలం ఈ రాశులకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: May 15, 2025 | 8:07 PM

వృషభం: ఈ రాశికి దశమంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో అధికారులతోనూ, సహోద్యోగులతోనూ సమస్యలు తలెత్తడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా పోటీదార్లతో ఇబ్బందులుండే అవకాశం ఉంది. అయితే, ఈ రాహువు మీద గురు దృష్టి పడడం వల్ల మీదే పైచేయిగా ఉండే సూచనలున్నాయి. శత్రువులు, ప్రత్యర్థుల మీద తప్పకుండా విజయాలు సాధిస్తారు. గురువు ధన కారకుడైనందు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కాకపోవచ్చు. కుటుంబంలో విభేదాలు, అపార్థాలు తలెత్తడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగకపోవచ్చు. అయితే, ఈ రాహువు మీద గురువు దృష్టి పడడం వల్ల ఇటువంటి సమస్యలు అతి తక్కువ కాలం మాత్రమే ఇబ్బంది పెడతాయి. ఆదాయం చాలావరకు వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా విభేదాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలకు కూడా అవకాశం ఉంది. అయితే, గురువు దృష్టి వల్ల ఈ సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఇవి ఎక్కువ కాలం పీడించే అవకాశం ఉండదు. జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల కుటుంబంలో ఏదో సమస్య లేదా అనారోగ్యాల కారణంగా సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి కూడా తగ్గుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుముఖం పడతాయి. గురువు దృష్టి వల్ల రాహువు ఈ ఫలితాలనివ్వడం తగ్గుతుంది. అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవచ్చు. కుటుంబంలో చిన్నాచితకా సమస్యలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో రాబడి మందగిస్తుంది. రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ సమస్యలు మరీ తీవ్రంగా పీడించకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న రాహువు వల్ల ధన నష్టం, నమ్మకద్రోహం, వైద్య ఖర్చులు, వృథా ప్రయాణాలు వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా బతకాల్సి వస్తుంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. గురు దృష్టి వల్ల ఈ సమస్యల తీవ్రత తగ్గడంతో పాటు, అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. రాహువు శుభగ్రహంగా మారి ఆదాయాన్ని పెంచడం, ఆరోగ్యం మెరుగ్గా ఉండడం జరుగుతాయి.



















