- Telugu News Photo Gallery Spiritual photos Pushpa Yagam Celebrations of Lord Venkateswara at Tirumala Srivari Temple Telugu Spiritual Photos
Tirumala: వైకుంఠ నాధుడికి వైభవంగా.. పుష్ప , పత్రాలతో కన్నుల పండుగగా పుష్పయాగం.. అబ్బురపరిచే ఫొటోస్..
కలియుగ వైకుంఠ నాథుడు, ఏడుకొండల వేంకటేశ్వరుడి పుష్పయాగం ఘనంగా జరిగింది. తిరుమల స్వామివారి ఆలయంలో అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Updated on: Nov 02, 2022 | 5:20 PM

కలియుగ వైకుంఠ నాథుడు, ఏడుకొండల వేంకటేశ్వరుడి పుష్పయాగం ఘనంగా జరిగింది. తిరుమల స్వామివారి ఆలయంలో అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కార్తీక మాసంలోని శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.

14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో స్వామివారికి సేవలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో ఉదయం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది.

గులాబి, గన్నేరు, మల్లె, మొల్లలు, చామంతి, సంపంగి, నూరు వరహాలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు.

బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్ల గానీ, ఉద్యోగుల వల్ల గానీ, భక్తుల వల్ల గానీ జరిగిన దోషాలను నివారించుకునే ఉద్దేశ్యంతో ఏటా పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

పుష్ప యాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పుష్పయాగం నిర్వహించలేకపోయారు. ఈసారి పరిస్థితులు మెరుగుపడటంతో శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా జరిపారు.

మరోవైపు.. తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.12 కోట్లు ఆదాయం వచ్చింది.

మరో వైపు తిరుమల,తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు టైంస్లాట్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను చేపట్టారు.
