- Telugu News Photo Gallery Spiritual photos Namami govinda pancha gavya products launched in tirupati
Tirupati: శ్రీవారి భక్తులకు అందుబాటులో గో ఆధారిత ఉత్పత్తులు.. త్వరలో యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్న టీటీడీ
Tirupati: తిరుపతి పాత డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని టిటిడి ప్రారంభించింది. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం దేశంలోనే 15 ప్రముఖ వైద్యశాలలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేపర్ వెయిట్లు, విక్రయం ప్రారంభించారు
Updated on: Jan 28, 2022 | 8:28 AM

టిటిడి ఆధ్వర్యంలో "నమామి గోవింద" పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం మైనదని టిటిడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా 15 రకాల ఉత్పత్తులు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతి ఆలయంలో గోవు ఉండాలి, గో పూజ నిర్వహించాలన్నారు. భక్తులు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఇందుకోసం కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన పంచగవ్యలను టిటిడి గోశాలలోని గోవుల నుండి సేకరించనున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు దేశీయ గో జాతుల నుండి సేకరించిన పాలు, నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో స్వామివారికి నైవేద్యం, గత ఏడాది నవనీత సేవ ప్రారంభించామన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు టిటిడి గో శాలలను అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారుచేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. కావున అగరబత్తీల ఉత్పత్తి రెండింతలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన కళాకృతులు విక్రయించనున్నట్లు చెప్పారు. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కొరకు 15 వైద్యశాలలతో ఎంఓయు చేసుకున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో సనాతన ధర్మ వ్యాప్తికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై ఎంఓయు కుదుర్చుకున్నామన్నారు. ఇందులోని రైతులు గోవుల నుండి లభించే గో మూత్రం, గోమయం నుండి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకుని, రసాయన ఎరువులు వినియోగించకుండా పండించిన పప్పు దినుసులను టిటిడి కొనుగోలు చేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు రెండు ఆధునిక గోశాలను అభివృద్ధి చేసి, అక్కడ ఉన్న యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

గోవు పాలు, పెరుగు, నెయ్యికి ఎంత విశిష్టత ఉందో, గోమూత్రం, గోమయం(పేడ)కు కూడా అంతే విశిష్టత ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. సనాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో వీటిపాత్ర కీలకమైనదని ప్రజలకు తెలియజేసేందుకు టిటిడి పంచగవ్య ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.

పంచగవ్య ఉత్పత్తులతో తయారు చేసిన హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, అగరబత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, ధూప్ చూర్ణం, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ధూప్‌చూర్ణం సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు, కౌడంగ్ లాగ్ భక్తులకు అందుబాటులో ఉన్న్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న 15 రకాల ఉత్పత్తులతో పాటు త్వరలోనే మరిన్ని ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టనున్నారు,

టిటిడి ఉద్యోగులకు మరింత ఆరోగ్య భద్రత కోసం దేశంలోని 15 ప్రముఖ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం కొరకు ఎంఓయు చేసుకున్నారు. ఇందుకోసం టిటిడి ఉద్యోగులకు రూ.25 కోట్లతో ఆరోగ్య నిధి ఏర్పాటు చేశారు. అనంతరం ఉద్యోగుల హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
