- Telugu News Photo Gallery Spiritual photos Mystery vinayaka temple: Tamil Nadu's Famous Courtallam naadi ganapathi Temple, know the details
Vinayaka Chavithi: నాటి బ్రిటిష్ గవర్నర్ తో పూజలు అందుకున్న వినాయకుడు.. మనిషిలా నాడి కొట్టుకునే గణపతి ఆలయం ఎక్కడంటే
భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. రహస్యలను దాచుకున్న ఆలయాలు నేటికీ కొన్ని మానవ మేథస్సు కు అందని మిస్టరీగానే నిలిచాయి. అలాంటి ఆలయాలు కొన్ని నాటి బ్రిటిష్ పాలకుల చేత కూడా దణ్ణం పెట్టించుకున్నాయి. అలాంటి అద్భుతమైన గణపతి ఆలయంలో నాటి బ్రిటిష్ పాలనలో ఒక గవర్నర్ కు రాతికి ప్రాణం ఉందని రుజువు చేయడమే కాదు ఆ గవర్నర్ ఆలయానికి వచ్చి నమస్కారం చేసేలా చేశాడు నాటి సిద్ధయోగి. వినాయక చవితి రానున్న నేపధ్యంలో రహస్య ఆలయం ఎక్కడ ఉంది.. ఆ ఆలయ విగ్రహ ప్రతిష్ట సమయంలో ఏమి జరిగిందో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Sep 02, 2024 | 3:51 PM

సంస్కృతి, వాస్తుశిల్పలకు నెలవు దేవాలయాల రాష్ట్రంగా ఖ్యాతిగాంచిన తమిళనాడులోని తిరునల్వేరి జిల్లాలో కుర్తాళంలో ఒక గణపతి ఆలయం అనేక రహస్యాలను దాచుకుంది. ఇక్కడ మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం, అద్భుత జలపాతాలున్నాయి. ఈ జలపాతంలోని నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయని.. ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం. ఈ నీటిపై పరిశోధన చేసి అది నిజం అని శాస్త్రజ్ఞులు అంగీకరించారు.

చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుంచి చాలా వేగంగా భూమి మీదకు చేరుకుంటుంది. ఈ జలపాతం ప్రవహించే ప్రాంతంలో అనేక ఔషధ గుణాలున్న వన మూలికలు దొరుకుతాయి. అనేకాదు ఈ జలపాతం నీటికి సైతం వ్యాధులను నయం చేసే గుణం ఉందని నమ్మకం. మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయనినమ్మకం. అందుకనే ఈ జలపాతంలో స్నానం చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ఇక ఇక్కడ ఉన్న వినాయకుడిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కూడా ఒక కథ ఉంది. ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి నిర్ణయించుకున్న మహా సిద్ధయోగి మౌనస్వామి ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం ఇక్కడ వినాయకుడి విగ్రహన్ని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేయాలని భావించారు.

ఈ విషయం తెలిసిన అప్పటి బ్రిటిష్ పాలనలో మద్రాస్ గవర్నర్ గా పనిచేస్తున్న ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏమిటి అంటూ హేళన చేశాడట. అప్పుడు ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని గవర్నర్ కు చెప్పారు. గవర్నర్ పిలుపుతో వచ్చిన వైద్యుడితో మహా సిద్ధయోగి విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పాడు. అప్పుడు వైద్యుడు కూడా ఏమిటి రాతి విగ్రహన్నికి నాడి చూడడం.. అసలు ప్రాణం ఉండదు కదా అంటూ విగ్రహాన్ని పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు.

తరవాత మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సంప్రదాయంగా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం అక్కడ ఉన్న వైద్యుడిని ఇప్పుడు గణపతి నాడి చూడమని చెప్పారు. అప్పుడు వైద్యుడు స్టెతస్కోప్ తో విగ్రహ నాడిని పరిశీలించాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆశ్చర్య పడేలా గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకోవడం వినిపించింది. అదే విషయం అక్కడ ఉన్న గవర్నర్ తో సహా అందిరికీ చెప్పాడు.

ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్, డాక్టర్ ఇద్దరూ వినాయకుడికి నమస్కరించి.. మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ గణపతికి నాడి గణపతి అనే పేరు ప్రసిద్ది చెందారు. ఇక్కడ ఉన్న వినాయయక విగ్రహ తొడల నుంచి శబ్దం వినిపించిందట. అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు.

ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల వినాయక ఆలయానికి వినాయక చవితికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శించుకుని.. జలపాతంలో స్నానం చేసి వెళ్తారు.



















