- Telugu News Photo Gallery Spiritual photos Marriage Astrology 2025: These zodiac signs to get marry soon details in telugu
Marriage Astrology: కీలక గ్రహాల అనుకూలత..వారికి అతి త్వరలో పెళ్లి బాజాలు..!
ప్రస్తుతం గురు, శుక్ర, బుధ గ్రహాలు మిథున, కర్కాటక రాశుల్లో అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఇళ్లల్లో శుభ కార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. శ్రావణ, భాద్రపద మాసాల్లో, అంటే సెప్టెంబర్ మూడవ వారం వరకు కొన్ని రాశుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు ఒక ఇంటివారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
Updated on: Aug 06, 2025 | 6:22 PM

మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురు శుక్రులు కలిసి, ఉండడం వల్ల, ఇందులో గురువు సప్తమ స్ధానాన్ని వీక్షిస్తున్నందువల్ల పరిచయస్థుల్లో లేదా సన్నిహితుల కుటుంబంలో తప్పకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరికి అనుకూలమైన సంబంధం ఖాయమ వుతుంది. వరుడు లేదా వధువు కుటుంబం సంపన్న కుటుంబానికి చెందినవారై ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది.

వృషభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో గురు, శుక్రుల శుభ యుతి వల్ల తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా బంధువర్గానికి చెందిన సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేపట్టడానికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్న ప్రయత్నంతో సంబంధం కుదురుతుంది. బంధువుల్లోనే, బంధువుల ద్వారానే పెళ్లి సంబంధానికి ప్రయత్నించడం మంచిది. ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో గురు, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి ఒకటి రెండు నెలల్లో పెళ్లి యోగానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మంచి సంబంధం కుదురుతుంది. సాధారణంగా విదేశీ సంబంధం కుదరడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ సంబంధాలకు ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబ స్థానంలో రవి, బుధుల యుతి వల్ల బాగా ఇష్టపడిన వ్యక్తితో గానీ, ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల ఈ రాశివారికి తప్పకుండా త్వరలో వివాహ యోగం కలుగుతుంది. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే సూచనలున్నాయి. వీరికి అనుకోకుండా సంబంధం కుదిరి అతి తక్కువ సమయంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. గ్రహ సంచారాన్ని బట్టి బంధువర్గంలో పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. స్వదేశీ సంబంధాలనే ప్రయత్నించడం మంచిది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో, అంటే అదృష్ట స్థానంలో, గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అతి తక్కువ వ్యవధిలో పెళ్లి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. వీరికి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా స్వదేశీ సంబంధమే ఖాయం కావచ్చు. ప్రేమించిన వ్యక్తితో గానీ, పరిచయస్థులతో గానీ అనుకోకుండా పెళ్లి నిశ్చయమయ్యే అవకాశముంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అతి కొద్ది కాలంలో వీరికి వివాహ యోగం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరికి సెప్టెంబర్ లోపు వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇష్టపడిన వ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. బాగా సంపన్న కుటుంబంతో సంబంధం కుదిరే సూచనలున్నాయి. బంధువుల జోక్యంతో పెళ్లి యోగం పడుతుంది.



