- Telugu News Photo Gallery Spiritual photos History of Sri Venugopala Swamy Temple in Gopani Palli Komarolu Mandal in Prakasam District
janmashtami: పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట... కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ ఏమిటి..? ఆ గ్రామస్తులు పడ్డ కష్టం ఏంటి..? తర్వాత ఆ గ్రామస్తులు ఏమి చేశారు..? ఆ కృష్ణుడిని ఎలా ప్రసన్నం చేసుకున్నారు..? ఆ వివరాలను ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Aug 26, 2024 | 3:55 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. ఇక్కడికొచ్చే భక్తులు తమ కోరికలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైన వేణుగోపాలస్వామి నెరవేరుస్తాడని విశ్వసిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే... ఈ ఆలయం నుంచి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడని గ్రామస్తులు కథలు కథలుగా చెబుతుంటారు.

వేణుగోపాల స్వామికి సరైన పూజలు జరగకపోవడం వల్ల స్వామి అలిగి ఆలయం నుంచి గ్రామం నుంచి వెళ్లిపోయినట్లుగా గ్రామస్తులు నేటికీ చెప్పుకుంటారు. అంతేకాదు గ్రామస్తులలోని ఒకరికి స్వప్నంలో కనిపించి తాను ఆలయం నుంచి వెళ్ళిపోతున్నానని కావాలంటే రుజువుగా ఆలయ ముఖద్వారం తాను తన్నడంతో గుమ్మం బీటలు వారినట్లుగా ఉంటుందని శ్రీకృష్ణుడు స్వప్నంలో చెప్పాడట.

కృష్ణుడు వెళ్లిపోయినప్పటి నుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు తాండవించాయి. సరైన వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం పరిసర ప్రాంతాలకు చీకటి పడితే చాలు అటువైపు వెళ్లాలంటే ప్రజలు చాలా భయాందోళనలు చెందేవాళ్లు... ఇక్కడ ఆత్మలు ఆ సమయంలో తిరిగేవని నమ్మేవాళ్ళట. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి పూర్వ వైభవం తేవాలన్న తలంపుతో మరో మారు అంగరంగ వైభవంగా ఆలయ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అంతేకాదు గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు కృష్ణుడి పేరు పెట్టుకుంటామని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు.

కృష్ణుని ఆలయానికి తిరిగి ప్రాణప్రతిష్ట చేయడంతో కొద్దిరోజులకు గ్రామంలో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాలకు అడ్డుకట్టపడిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇక ఈ గ్రామంలో పుట్టబోయే బిడ్డలకు అత్యధికంగా కృష్ణుడికి సంబంధించిన పేర్లు వేణుగోపాల్, కృష్ణ, మాధవ్, గోపాల్, కృష్ణమోహన్ రెడ్డి ఇలా కృష్ణుడికి సంబంధించిన పేర్లను తమ పిల్లలకు పెడుతూ కృష్ణుడిపై ఉన్న భక్తిని ఆ గ్రామ ప్రజలు నేటికీ చాటుకుంటున్నారు.

ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం పూర్తిగా రాయితోనే జనమేజయ మహారాజు నిర్మించారట. గుడి గోపురం, గుడి ద్వారం రాయితో నిర్మించారట... తిరిగి ఆలయానికి ప్రాణ ప్రతిష్ట చేసిన అనంతరం సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామిని పూజించి కోరికలు కోరితే తమ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో ఈ గ్రామానికి గోపాలునిపల్లి అని గ్రామస్తులు పూర్వం నామకరణం చేశారని చెబుతున్నారు.
