- Telugu News Photo Gallery Spiritual photos Hide and seek sangameshwara temple in kurnool district in andhrapradesh
Hide and Seek Temple : భక్తులతో దాగుడుమూతలాడే సంగమేశ్వరుడు .. దాదాపు ఎనిమిది నెలల తర్వాత దర్శనం..
త్రివేణీ సంగమమే అత్యంత ప్రసిద్ధి అంటే.. ఇక సప్తనదులు ఒకే చోట కలిస్తే.. అది అద్భుతమైన ప్రదేశమే.. అలా ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ నదులన్నీ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని తాకుతూ వెళ్లి..చివరకు సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఉన్న ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది..
Updated on: Mar 22, 2021 | 3:14 PM

త్రివేణీ సంగమమే అత్యంత ప్రసిద్ధి అంటే.. ఇక సప్తనదులు ఒకే చోట కలిస్తే.. అది అద్భుతమైన ప్రదేశమే.. అలా ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ నదులన్నీ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలాన్ని తాకుతూ వెళ్లి..చివరకు సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఉన్న ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది..

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి 56 కి.మీ. దూరంలో సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 20న ఆలయం కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చాయి.

స్వామివారి ఆలయం కనిపించిన వెంటనే అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే స్వామివారిని దర్శించుకోవచ్చు.. 2020 జూలైలో అర్చకులు సంగమేశ్వరునికి చివరిసారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది.. మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. ఈ ఆలయాన్ని ధర్మరాజు ప్రతిష్టించినట్లుగా పురాణాల కథనం.ఏడు నదులు కలిసే క్షేత్రం కనుక దీనిని సప్తనది సంగమం అని కూడా అంటారు

పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో మునులు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. దీంతో ధర్మరాజు సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరాకుండా.. భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వేపలింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు విశ్వాసం.

అయితే ఈ సంగమేశ్వర ఆలయం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది.. క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సంగమేశ్వరుడు దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.





























