- Telugu News Photo Gallery Spiritual photos Dasara celebrations 2023: Ayudha Puja Performed By Bobbili Royal Family
Ayudha Puja: బొబ్బిలి కోటలో ఆయుధ పూజ.. రాజరిక సంప్రదాయంగా పూజలు చేసిన బొబ్బిలి వారసులు..
రాజాధిరాజా రాజమార్తాండ జయహో జయహో అంటూ సైనికులు రాజావారి కోటలో కవాతు చేశారు. కత్తులు, కటార్లు, డాళ్లు, బడిసెలు, తుపాకీలు చేతబూని కదం తొక్కారు. అదే సమయంలో వజ్ర వైడూర్యాలు పొదిగిన తలపాగా, ఒంటి నిండా ఆభరణాలు, నడుముకి కెంపులు, రత్నాలు పొదిగిన కత్తులతో, రాజరిక దుస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా కోట లోపల నుండి బయటకు వచ్చారు రాజావారు. అలా వచ్చిన రాజావారికి తమ మందీ మాగాధులు ఘన స్వాగతం పలికారు.
G Koteswara Rao | Edited By: Surya Kala
Updated on: Oct 26, 2023 | 6:20 PM

ఆచార వ్యవహారాలు, మేళతాళాలతో రాజులు హుందాగా ముందుకు నడుస్తుండగా సైనికులు వారిని దర్బార్ మహల్ కి తోడ్కొని వెళ్లారు. అప్పటికే దర్బార్ మహల్ లో రాజులు ఆశీనులయ్యేందుకు బంగారు, వెండి సింహాసనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సింహాసనం పై ఆఖరి పట్టాభిషిక్తుడైన దివంగత ఆర్ ఎస్ ఆర్ కె రంగారావు వారి చిత్రపటం ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నేటికీ రాజరికానికి నిలువుటద్దంలా ప్రతిబింభించే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చారు

విజయదశమి సందర్భంగా బొబ్బిలి కోటలో జరిగిన ఆయుధ పూజ అందరినీ ఉద్వేగభరితంగా మార్చింది. కోటలో ఆయుధ పూజ మరోసారి బొబ్బిలి యుద్ధాన్ని గుర్తు చేసింది. చారిత్మాత్మక బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది. ఈ యుద్దం విజయనగరం మహారాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య జరిగిన భీభత్సకాండ.. ఈ యుద్ధంలో బొబ్బిలి సంస్థానం తీవ్రంగా నష్టపోయింది. బొబ్బిలి రాజులు నేలకొరిగారు.

కోట పూర్తిగా ధ్వంసం అయ్యింది. మహరాణులు సైతం ఆత్మార్పణ చేసుకున్నారు. యుద్ధంలో పాల్గొన్న నాటి విజయనగరం మహారాజు అయిన పెద విజయరామ గజపతి కూడా అదే రోజు రాత్రి బొబ్బిలి సైనికాధ్యక్షుడు తాండ్ర పాపారాయుడు చేతిలో హతమయ్యాడు.

అలా జరిగిన బొబ్బిలి యుద్ధంలో ఇరు రాజ్యాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం జరిగి వందల సంవత్సరాలు అయినా నాటి జ్ఞాపకాలు మాత్రం నేటికీ మిగిలే ఉన్నాయి. చరిత్ర చెప్పిన ఆ యుద్దం ఇప్పటికీ అందరి కళ్ళ ముందు కదిలాడుతుంది. ఆ తరువాత రోజుల్లో బొబ్బిలి వారసులు తిరిగి తమ రాజ్యాన్ని పునర్ నిర్మించుకున్నారు. అప్పటి నుండి బొబ్బిలి వారసులు నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా భద్రపరిచారు.

వాటి కోసం దర్బార్ హల్ లో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అలా ఉంచిన ఆ ఆయుధాలను ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా బయటకు తీసి శుభ్రపరిచి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీయుల వారసులైన మాజీ మంత్రి రావు సుజయ్ కృష్ణ రంగారావు బహుదూర్, ఆయన సోదరుడు బేబినాయనలు సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ జరిపారు.





























