- Telugu News Photo Gallery Spiritual photos CM KCR performs Rajashyamala, Shatachandi Yagams at his farmhouse to seek divine blessings for a third time
CM KCR: సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?
BRS చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు తొలినాళ్ల నుంచి దైవచింతన ఎక్కువే. అందుకే దేవాలయాలు సందర్శించి.. మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ యాగాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి చెందాని.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని.. .. 2015లో చండీయాగం నిర్వహించారు. అనంతరం.. 2018 రెండోసారి ఎలక్షన్స్‌ను వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్..మళ్లీ అధికార పగ్గాలు చేపట్టారు.
Rakesh Reddy Ch | Edited By: Ram Naramaneni
Updated on: Nov 01, 2023 | 3:05 PM

ఈ ఎన్నికలకు కూడా అదే సెంటిమెంట్‌తో కేసీఆర్.. యాగాన్ని తలపెట్టారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని పొలంలో నవంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం చేస్తున్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పర్యవేక్షణలో యాగం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు యాగంలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంతో పాటు లోకకళ్యాణార్థం శతచండీ యాగము నిర్వహించారు.

200 మంది వైదికులు మంగళవారం సాయంత్రమే ఎర్రవల్లికి చేరుకున్నారు. తొలిరోజు తెల్లవారుజామున సంకల్పంతో యాగానికి శ్రీకారం చుట్టారు. రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువుల తంతు ఉంటుంది. చివరిరోజు పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.

బుధవారం శతచండీయాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, త్రైలోక్య మోహన గౌరీ హోమము , అఘోరాస్త్ర హోమ కార్యాలను, చండీ సప్తశతీ పారాయణములు, చతుర్వేద పారాయణములు, మహామంగళారతి, మంత్రపుష్పము, అష్టావధాన – సేవ తదితర కార్యక్రమాలను సీఎం కేసిఆర్ దంపతులచేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ యాగం చేస్తున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. రాజశ్యామల యాగం మహాశక్తివంతమైనదని.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే కేసీఆర్ రాజశ్యామల యాగం చేపట్టారన్నారు.

రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని స్వరూపానందేంద్ర వివరించారు. రాజశ్యామల అమ్మవారు కొలువైన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం అని.. హైదరాబాద్ మహానగరంగా వెలుగొందుతోందంటే అది గతంలో చేసిన యాగ ఫలితమే అని వెల్లడించారు.

'మహాభారతం చదివిన జ్ఞాని కేసీఆర్. హైందవ తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన నేత. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలి' అని ఆశీర్వదించారు స్వరూపానందేంద్ర.

కేసీఆర్ యాగం చేసినప్పుడల్లా.. ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం అందుకుంటారని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.





























