- Telugu News Photo Gallery Spiritual photos Astrology in Telugu: The wishes of these zodiac signs will be fulfilled in next one month
Zodiac Signs: గ్రహాల సంచారంలో కీలక మార్పులు.. నెల రోజుల్లో వారి మనసులోని కోరికలు నెరవేరడం పక్కా..!
Astrology in Telugu: ఈ నెలలో రవి మిధున రాశి ప్రవేశం, బుధ గ్రహం 24న మిధున రాశి సంచారం, 18న అమావాస్య, అదే రోజు నుంచి శని వక్రగతి ఆరంభం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రభావంతో ఆ రాశుల వారి మనసులోని కోరికలు మరో నెల రోజుల్లో నెరవేరబోతున్నాయి.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jun 17, 2023 | 12:22 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రగ్రహాన్ని బట్టి మనస్తత్వాన్ని, మనసులోని కోరికలను, మనస్థితిని చెప్పవలసి ఉంటుంది. ఈ నెలలో వివిధ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయా, లేదా, వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం. ఈ నెలలో రవి మిధున రాశి ప్రవేశం, బుధ గ్రహం 24న మిధున రాశి సంచారం, 18న అమావాస్య, అదే రోజు నుంచి శని వక్రగతి ఆరంభం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

మేష రాశి: సాధారణంగా ఈ రాశి వారు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలోను, వ్యాపారంలోను ఒళ్ళు వంచి పని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే వీరికి బాధ్యతలు అప్పగించడం, అధికారం కట్టబెట్టడం, మధ్య మధ్య పొగడటం చాలా అవసరం. ప్రస్తుతం గురు, బుధ, శుక్ర సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నందువల్ల వీరి మనస్తత్వానికి తగ్గట్టుగా కొన్ని వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు వీరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంతోపాటు వీరిని ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. అధికార యోగం కూడా పట్టే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఎక్కువగా కష్టజీవులు. ఎంత బరువు అయినప్పటికీ మోయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, వీరిని ఏదో విధంగా సంతృప్తి పరచడం ఉత్తేజం కలిగించడం చాలా అవసరం. పని వేళలను పొడిగించినప్పటికీ లేదా పని భారం నుంచి పెంచినప్పటికీ వీరి నుంచి సాధారణంగా ఫిర్యాదులు ఉండకపోవచ్చు. అదనంగా కొద్దిగా ముట్ట చెబితే సరిపోతుంది. ప్రస్తుతం బుధ శుక్ర గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నందు వల్ల, శరీరం పూర్తిగా అలసిపోయేంతవరకు పనిచేయడానికి వీరు సిద్ధపడతారు. అందుకు తగ్గ ప్రతిఫలం పొందటం కూడా జరుగుతుంది. తప్పకుండా వీరికి ప్రతిఫలంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది.

మిధున రాశి: సాధారణంగా ఈ రాశి వారు శారీరక కష్టం కంటే మానసిక కష్టం ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. తమ ప్రతిభ పాటవాలకు శక్తియుక్తులకు వీరు సరైన గుర్తింపును, ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ఉంటారు. అవి దక్కని పక్షంలో తీవ్రంగా నిరాశ నిస్పృహలో కూరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి బుధ, శుక్ర గ్రహాలు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల వీరి శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించినంత ప్రయోజనం కలగకపోయినప్పటికీ, ఉద్యోగ సుస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. తప్పకుండా వీరి మనసులోని కోరిక నెరవేరటం జరుగుతుంది.

కర్కాటక రాశి: సాధారణంగా ఈ రాశి వారు తమ వృత్తి లేదా ఉద్యోగంతో మమేకం చెందుతుంటారు. వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా సుస్థిరతకు అవకాశం ఉంటే వీరు ఎంత పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఉద్యోగ స్థానంలో గురువు, లాభ స్థానంలో బుధ గ్రహం అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఉద్యోగ స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభించే అవకాశం ఉంది. ఇతరుల బాధ్యతలను కూడా పంచుకోవడంలో ఈ రాశి వారు ముందుంటారు. అందువల్ల సాధారణంగా వీరికి మానసిక కష్టంతో పాటు శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఎక్కువగా స్వేచ్ఛాజీవులు. తాము స్వయంగా బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడతారు. ఇతరులు తమ మీద పెత్తనం చెలాయించడం ఏమాత్రం సహించరు. సాధారణంగా ఈ రాశి వారిలో అసంతృప్తి, అసమ్మతి ఎక్కువగా వ్యక్తమవుతూ ఉంటాయి. అందువల్ల అధికారులు ఈ రాశికి చెందిన ఉద్యోగులను జాగ్రత్తగా ఉపయోగించుకోవలసి ఉంటుంది. ప్రత్యేక బాధ్యతలను అప్పగించాలని ఈ రాశి వారు కోరుకుంటారు. తమను ప్రత్యేకంగా, అందరికంటే భిన్నంగా చూడాలని ఆశిస్తారు. గురు గ్రహం, రాశి నాథుడైన రవి గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది.

కన్యా రాశి: ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా తమ పని తాము చేసుకుపోవడం అనేది ఈ రాశి వారి సహజ లక్షణం. ఉద్యోగంలో ఇతరులను కలుపుకొని పోవటం వీరికి ఇష్టం లేని వ్యవహారం. తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి మాత్రమే మీరు పరిమితం అవుతుంటారు. తమకు సంబంధించినంత వరకు వీరు పనిభారం పెరిగినా, అదనపు బాధ్యతలు అప్పగించినా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఈ రాశి వారికి ప్రస్తుతం బుధ, రవి, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల, వీరి మనస్తత్వానికి తగ్గట్టుగా ఉద్యోగ జీవితం గడిచిపోయే అవకాశం ఉంది.

తులా రాశి: ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇతరులను కలుపుకుపోవటానికి, ఇతరులతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. వీరిలోని సహజ నాయకత్వ లక్షణాల వల్ల తొందరగా అధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి, అసాధ్యం అనుకున్న పనులు చేపట్టడానికి వీరు ముందుంటారు. ప్రస్తుతం గురువు, శుక్రుడు, రవి అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి వీరి మనస్తత్వానికి తగ్గ ఉద్యోగం రావటం జరుగుతుంది. సాధారణంగా వీరు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ అధికారులు వీరికి అనుకూలంగా ఉండటం జరుగుతుంది.

వృశ్చిక రాశి: సాధారణంగా ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఇతరులతో కలవడానికి ఇష్టపడరు. అదనపు బాధ్యతలను చేపట్టడం కూడా ఇష్టం ఉండదు. అతి త్వరగా ఓర్పు, సహనాలను కోల్పోతుం టారు. అందువల్ల అధికారులు వీరికి పరిమిత మైన బాధ్యతలనే అప్పగించడం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఈ రాశి వారు తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో, సక్ర మంగా, సజావుగా పూర్తి చేయడంలో దిట్టలు. ఈ రాశి వారికి ప్రస్తుతం శుక్ర గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం వీరికి ఆశించినంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

ధనూ రాశి: సాధారణంగా ఈ రాశి వారు కలుపుగోలుతనంతో వ్యవహరిస్తుంటారు. వృత్తి ఉద్యోగాలలో వీరు ఇతరుల బాధ్యతలను కూడా నెత్తిన వేసుకొని పనిచేస్తూ ఉంటారు. పనిచేయడంలో ఈ రాశి వారికి అలుపు సొలుపు ఉండదు. అధికారులు వీరి ప్రతిభను శ్రమను గుర్తించి ప్రోత్సహించడం అవసరం. ఎవరైనా అవమానించినా, చులకనగా చూసినా వీరు తిరుగుబాటుకు సిద్ధపడతారు. అందువల్ల అధికారులు ఈ రాశి వారిని తరచూ అభినందించటం, ప్రోత్సహించడం చాలా అవసరం. ప్రస్తుతం ఈ రాశి వారికి గురు బుధ రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అధికారుల గుర్తింపునకు ఆదరణకు ఎంతగానో అవకాశం ఉంది.

మకర రాశి: ఎంత మానసిక, శారీరక శ్రమనైనా భరించడానికి, ఎటువంటి బాధ్యతలను అయినా మోయటానికి సిద్ధపడే ఈ రాశి వారు ఎక్కువగా గుర్తింపును, ప్రోత్సాహాన్ని కోరుకుంటారు. మౌనంగా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుని పోయే ఈ రాశి వారికి తరచూ స్ఫూర్తి, ఉత్తేజం, ప్రేరణ అవసరం అవుతుంటాయి. వీటికి ఏమాత్రం భంగం కలిగినా ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు సాగిస్తారు. ప్రస్తుతం ఈ రాశి వారికి శని, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల శారీరక, మానసిక శ్రమతో పాటు తగిన ఆదాయం, ప్రతిఫలం, గుర్తింపు ఉన్న ఉద్యోగంలో స్థిర పడటానికి అవకాశం ఉంది.

కుంభ రాశి: సాధారణంగా ఈ రాశి వారు నిశ్శబ్దంగా ఎటువంటి హడావిడి లేకుండా పనిచేసుకుపోవడంలో ముందుంటారు. ఉద్యోగ జీవితానికి సంబంధించినంత వరకు వీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం, అనవసర విషయాలను పట్టించుకోవడం జరిగే పనికాదు. ఎటువంటి బాధ్యతలు అప్పగించినప్పటికీ సకాలంలో పూర్తి చేయడం వీరి సహజ స్వభావం. వృత్తి ఉద్యోగాలలో వీరు కఠినమైన క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇటువంటి విషయాలలో శని బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరు కోరుకున్న విధంగా, కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడటానికి అవకాశం ఉంది.

మీన రాశి: సాధారణంగా ఈ రాశి వారు అంటి ముట్టనట్టుగా తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ జీవితాలలో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం ఈ రాశి వారికి అలవాటు. తమ బాధ్యతలను పూర్తి చేయడం మీద మాత్రమే శ్రద్ధ పెడతారు. పని వేళలకు కట్టుబడి ఉంటారు. ఎక్కువగా అధికారాన్ని, ప్రమోషన్లను, గుర్తింపును ఆశించడం కూడా జరగకపోవచ్చు. అయితే, బాధ్యతల నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తారు. ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి తగ్గ ఉద్యోగంలో వీరు కొనసాగే అవకాశం ఉంది.





























