- Telugu News Photo Gallery Sircilla handloom maker makes a Golden silk saree, know details Telugu News
Gold Saree: చేనేత మగ్గంపై బంగారు పట్టు చీర.. సిరిసిల్ల నేతన్న మరో అద్భుత ఆవిష్కరణ
Gold Silk Saree: అగ్గిపెట్టేలో ఇమిడే చీర నేసిన మగ్గంపై ఇప్పుడు బంగారు చీర రూపు దిద్దుకుంది. భద్రాద్రి రామయ్యకు పట్టుపీతాంబరాలను అందించిన చేనేత మగ్గం ఇప్పుడు పసిడితో పట్టుచీర నేసింది. పెళ్లి బట్టలతో పాటు ఎందరో ప్రముఖుల చిత్రాలతో మగ్గంపై అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దిన చేనేత కళాకారుడు ఇప్పుడు మరో ఆవిష్కరణ గావించాడు. సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ పసిడి పోగులతో పట్టు చీరను నేసి ఔరా అనిపించాడు..
Updated on: Dec 13, 2023 | 11:36 AM

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా బంగారంతో పట్టుచీరను తయారు చేసిన ఘనత వెల్ది హరిప్రసాద్ దక్కించుకున్నాడు. చేనేత కళాకారుడు హరిప్రసాద్ గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీర, పట్టు పీతాంబరాలతో నేసిన చీరను అప్పటి ప్రభుత్వం నుండి భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి నేసి అందించాడు. సూక్ష్మ మరమగ్గం, రాట్నం, చేనేత మగ్గం తయారుచేసి అందరి మన్నలను పొందాడు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సొంతంగా మొట్టమొదటి డబుల్ పేటి ఎలక్ట్రానిక్ (మగ్గం) జకార్డును హరి ప్రసాద్ సొంతంగా తయారు చేసుకొని దానిపై పట్టు చీర నేశాడు. డబుల్ పేటి మగ్గం ప్రత్యేకతలు తెలుసుకున్న మహారాష్ట్రలోని పుణే సిటీ లో స్థిరపడ్డ తెలంగాణ కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఇచ్చిన ఆర్డర్ మేరకు గత నెల రోజుల నుండి కష్టపడుతూ సుమారు ఒక లక్ష 80 వేల రూపాయలతో 4 గ్రాముల బంగారు జారీ తో పట్టుచీర తయారు చేశాడు.

మొదటి ఆర్డర్ ఇచ్చిన పారిశ్రామికవేత్తకు ప్రత్యేక కృత్ఞతలు తెలుపుతూ... ఇలాంటి చీర నేయడం సంతోషంగా ఉందని అన్నారు హరిప్రసాద్. చేనేత కళా అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి ఆవిష్కరణలు చేసి మళ్ళీ జీవం పోస్తున్న హరిప్రసాద్ పలువురు ప్రశంసించారు.

చేనేత కళాకారులు అంతరించిపోయే దశలో ఉందని గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహాలు అందించలేదని, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మాలాంటి చేనేత కళాకారులను ప్రోత్సహించి, వర్క్ షాప్ నిర్వహించేల కృషి చేస్తే ఆసక్తి ఉన్న చేనేత కళాకారులు నేర్చుకునే అవకాశం ఉందని చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు హరిప్రసాద్.

ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే మరీ కొందరికి ఉపాధి కల్పిస్తానని చెబుతున్నాడు. చేనేత మగ్గంపై మరెన్నో అద్భుతాలు, కళాఖండాలను ప్రపంచానికి అందిస్తానని ఆశభావం వ్యక్తం చేస్తున్నాడు కళాకారుడు వెల్ది హరిప్రసాద్.




