టీ తాగే డబ్బులు పొదుపు చేస్తే చాలు.. రూ.3 లక్షల రాబడి పొందవచ్చు! ఎలాగంటే..?
సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేయవచ్చు. నెలకు రూ.500 పొదుపు చేయడం ద్వారా, 15 సంవత్సరాలలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.500 లేదా రూ.1000 పెట్టుబడి పెట్టడం ద్వారా, 21 సంవత్సరాల తర్వాత లక్షల్లో రిటర్న్స్ పొందవచ్చు.
Updated on: May 19, 2025 | 6:51 PM

చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ, డబ్బులను పొదుపు చేయలేరు. అందుకే మంత్ ఎండ్ వచ్చేసరికి చిన్ని చిన్న అప్పులు చేయడం, ఏదైనా పెద్ద అవసరమో, అపదో వస్తే.. పెద్ద మొత్తంలో అప్పులు చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ, పొదుపు చేస్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ పొదుపు చిన్న మొత్తంలో అయినా సరే.. కచ్చితంగా అవసరానికి అక్కరకు వస్తుంది. పెద్దగా ఏం అవసరం లేదు.. చాలా మందికి రోజు టీ తాగే అలవాటు ఉంటుంది.

ఇంట్లో తాగినా కూడా బయటికి వెళ్లిన సమయంలోనో, ఆఫీస్ నుంచి అలా కాసేపు బయటికి వెళ్తేనో.. బయట టీ షాపుల్లో కూడా తాగుతూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్న చిన్న బడ్డి కొట్లలతో కూడా టీ మినిమమ్ రూ.10 నుంచి రూ.20 మధ్య ఉంది. సరే.. యావరేజ్‌గా ఓ రూ.15 అనుకోండి. రోజుకు ఒకసారి బయట టీ తాగితే నెలకు రూ.450 అవుతుంది. దానికి ఇంకో రూ.50 కలిపి.. ఆ డబ్బుని పొదుపు చేస్తే చాలు రూ.3 లక్షలు తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం..

సుకన్య సమృద్ధి యోజన.. ఈ స్కీమ్ గురించి వినే ఉంటారు. ఆడ పిల్లల చదువు, పెళ్లి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ఇందులో నెలకు కేవలం రూ.500 పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ సమయం 21 ఏళ్లు ఉంటుంది. అయితే అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక చదువు కోసం కొంత మొత్తంలో డబ్బు తీసుకోవచ్చు. పూర్తి మొత్తం తీసుకోవాలంటే మాత్రం 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిందే.

సుకన్య సమృద్ధి పాలసీ కింద పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఖాతా తెరవవచ్చు. దీనికి అమ్మాయి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, పాన్ కార్డ్ అవసరం. ఇందులో మీరు నెలకు రూ. 500 పెట్టుబడి పెడుతూ.. 15 ఏళ్లు కొనసాగిస్తే.. రూ.90 వేలు జమ అవుతుంది. దీనిపై రూ.1,87,103 వడ్డీ లభిస్తుంది. పథకం మెచ్యూరిటీ అనంతరం మీకు రూ.₹2,77,103 లభిస్తుంది. ఇలా మీరు వడ్డీ రూపంలోనే ఏకంగా సుమారు రూ.2 లక్షలు సొంతం చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు ఈ పథకంలో నెలకు రూ.1000 పెడితే 15 ఏళ్లలో ₹1.80 లక్షలు జమ అవుతుంది. దానిపై ₹3,74,206 వడ్డీ. మొత్తం ₹5,54,206 వస్తుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.250 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు ఈ ఖాతాలు తెరవవచ్చు. కవలలు ఉంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.




