- Telugu News Photo Gallery Pumpkin Seeds Vs Sunflower Seeds: Which Is Best for Heart Health and Blood Sugar Control
గుమ్మడి గింజలు Vs పొద్దుతిరుగుడు గింజలు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Pumpkin Seeds Vs Sunflower Seeds: ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారంగా గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు గింజలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని సలాడ్లలో, స్మూతీలలో వేసుకుని తినడం లేదా డైరెక్ట్‌గా తినడం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ రెండు గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మంచి రుచిని ఇస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. మీరు మీ డైట్‌లో ఫైబర్, ప్రోటీన్ లేదా మెగ్నీషియం పెంచుకోవాలని అనుకుంటే ఈ రెండు గింజలు మంచి ఎంపిక. అయితే రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో పోల్చి చూద్దాం.
Updated on: Dec 14, 2025 | 8:40 AM

ఫైబర్: ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో దాదాపు 11.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే గుమ్మడికాయ గింజలలో 6.5 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఫైబర్ కోసం చూసేవారికి పొద్దుతిరుగుడు విత్తనాలు మెరుగైన ఎంపిక.

ప్రోటీన్: కండరాలు పెరగడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ముఖ్యంగా శాఖాహారులకు గింజలు మంచి ప్రోటీన్ వనరు. 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో దాదాపు 29.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పొద్దుతిరుగుడు విత్తనాలలో 19.3 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ కావాలంటే గుమ్మడికాయ గింజలు ఉత్తమమైనవి.

మెగ్నీషియం: మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎముకల బలానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి చాలా అవసరం. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం చాలా ఎక్కువ. 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో దాదాపు 550 mg మెగ్నీషియం ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో కేవలం 129 mg మాత్రమే ఉంటుంది. మెగ్నీషియం కోసం గుమ్మడికాయ గింజలు అద్భుతమైన వనరు.

ఆరోగ్య రహస్యాలు: షుగర్ ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో పొద్దుతిరుగుడు విత్తనాలు సహాయపడతాయని ఒక అధ్యయనం తెలిపింది. గుమ్మడికాయ గింజలను తరచుగా తీసుకోవడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో ముడిపడి ఉందని మరొక అధ్యయనం సూచించింది.

గుమ్మడికాయ - పొద్దుతిరుగుడు విత్తనాలు రెండూ వేటికవే గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఒకదానిపై ఆధారపడకుండా, రెండింటినీ కలిపి మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి ప్రత్యేక పోషక ప్రయోజనాలను పొందవచ్చని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.




