- Telugu News Photo Gallery Political photos Telangana ministers ktr and indrakaran reddy inaugurates of pranavayuvu urban forest park at gajularamaram
Urban Forest Park: గ్రేటర్ వాసులకు అందుబాటులోకి మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్.. ప్రారంభించిన మంత్రులు.. దృశ్యాలు..
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో అర్భన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. గాజులరామారంలో ప్రాణవాయువు అర్భన్ ఫారెస్ట్ పార్క్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు,
Updated on: Jan 25, 2022 | 2:31 PM

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో అర్భన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రాణవాయువు అర్భన్ ఫారెస్ట్ పార్క్‌ను రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్ లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు తెలిపారు.

గాజులరామారం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లోని 454 ఎకరాల విస్తీర్ణంలో రూ. 11.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. సందర్శకులను అకట్టుకునేలా యోగా షేడ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, గజీబో, ఆటవిడుపు కోసం చిన్న పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, కుంటుంబంతో హాయిగా సేదతీరేలా పిక్నిక్ ఏరియా, నేచురల్ రాక్ సిట్టింగ్, తదితర సౌకర్యాలను కల్పించారు.

సందర్శకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేలా పర్యావరణ పరిరక్షణ, అడవుల ప్రాధన్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒపెన్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు.

మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు, స్వచ్చమైన ప్రాణవాయువును అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు దోహదం చేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.





























