- Telugu News Photo Gallery Political photos AP CM Chandrababu Receives Kaloji Poetry Book As Gift From Telangana CM Revanth Reddy
CBN Revanth: ఇద్దరు సీఎంలు కలిసిన వేళ.. చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక భేటీకి హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికైంది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలతో పాటు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. సమావేశం ముగిసిన అనంతరం ఉమ్మడి ప్రెస్‌మీట్ ఉండే అవకాశం ఉంది..
Updated on: Jul 06, 2024 | 7:34 PM

శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రులో భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్‌రెడ్డి పాల్గొనగా..తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఏపీ,తెలంగాణ సీఎస్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

అనంతరం చంద్రబాబును సన్మానించి..కాళోజీ రాసిన "నా గొడవ" పుస్తకాన్ని బహూకరించారు రేవంత్‌రెడ్డి. నిజాం కాలం నుంచి 1980ల వరకూ పాలన..ఏళ్లతరబడి సాగిన తెలంగాణ ప్రజాఉద్యమాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించారు ప్రజాకవి కాళోజి. ఇక చంద్రబాబు..రేవంత్‌రెడ్డికి తిరుమల శ్రీవారి ప్రతిమతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడకుండా ఉమ్మడి అజెండాపై కలిసి పని చేయాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని , ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉంది.

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయినా కూడా.. అనేక కీలకాంశాలు ఇంకాపెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలను ఖరారు చేశారు.

ఈ ఎజెండాలో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలు ఉన్నాయి.
