ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిపా వైరస్ చరిత్రను పరిశీలించినట్లయితే.. మలేషియాలో పందుల పెంపకందారులలో మొదటిసారిగా 1999లో అంటువ్యాధి నిపా వైరస్ ను గుర్తించారు. అయితే, ఆ తర్వాత మలేషియాలో కొత్త వ్యాప్తి లేదు. 2001లో బంగ్లాదేశ్‌లో అంటువ్యాధి కేసులు నమోదయ్యాయి.. అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం ఆ దేశంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ వ్యాధి తూర్పు భారతదేశంలో కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. కంబోడియా, ఘనా, ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌తో సహా అనేక దేశాలలో వైరస్ (ప్టెరోపస్ బ్యాట్ జాతులు), అనేక ఇతర గబ్బిలాల వాహకాలు కనుగొనబడినందున అనేక ఇతర ప్రాంతాలు కూడా సంక్రమణ ప్రమాదంలో ఉండవచ్చు. నిపా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.