Health Tips: రోజూ ఉదయం పరగడుపున టీ బదులు.. ఈ పానీయాలను త్రాగండి.. మీ గుండె ఆరోగ్యం పదిలం..
ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్నిచ్చే పానీయాలను తీసుకోవడం అవసరం. ఈ పానీయాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం నుండి మెరుగైన రక్త ప్రసరణ జరిగేలా చేసే వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరోగ్యకరమైన గుండె కోసం ఉదయం పరగడుపున తీసుకోదగిన ఆరోగ్యకరమైన పానీయాల గురించి తెలుసుకుందాం..
Updated on: Sep 21, 2023 | 1:48 PM

బిజీ బిజీ జీవితం, ఒత్తిడితో కూడిన పని, అనారోగ్యకరమైన జీవనశైలి.. మారిన ఆహారం వంటి అనేక కారణాల వల్ల గత కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే రోజూ మనం ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఉదయం తినే ఆహారం రోజంతా మన ఆరోగ్యం, మానసిక స్థితిని నిర్ణయిస్తుంది.

గోరువెచ్చని నిమ్మకాయ నీరు: మీ రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మ రసం నీటితో ప్రారంభించండి. నిమ్మకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

క్రాన్‌బెర్రీ జ్యూస్: క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్ త్రాగాలి.

పసుపు పాలు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనం. ఒక టీస్పూన్ పసుపును గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఉదయం పరగడుపున ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్ జ్యూస్ నైట్రేట్‌లతో సహా పోషకాల పవర్‌హౌస్. రక్త నాళాలను పనితీరుని సక్రమం చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఉదయాన్నే బీట్‌రూట్ రసం తాగడం వల్ల మీ గుండెకు మేలు జరుగుతుంది.

వీటన్నింటితో పాటు ఉదయాన్నే పుష్కలంగా నీరు తాగడం మర్చిపోవద్దు. ఈ పానీయాలను రోజూవారీ డైట్ లో చేర్చుకోవాలి. రోజూ రెగ్యులర్ గా ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. వీటిని తాగడం వలన రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.





























