- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Royal Challengers Bengaluru Creates New World Record In T20 History
IPL 2024: ఉత్కంఠభరితమైన పోరులో ఓడినా.. ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
IPL 2024 RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 288 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి పరాజయం పాలైనప్పటికీ ఆర్సీబీ ప్రత్యేక రికార్డును లిఖించింది.
Updated on: Apr 16, 2024 | 4:10 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 30వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 8 సిక్సర్లు, 9 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. హెన్రిక్ క్లాసెన్ (67) హాఫ్ సెంచరీ, ఐడెన్ మార్క్రామ్ 32, అబ్దుల్ సమద్ 37 పరుగులు చేశారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

288 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ధీటైన పోరాటాన్ని కనబరిచింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 42 పరుగులు చేయగా, ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన దినేష్ కార్తీక్ 35 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. ఈ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

విశేషమేమిటంటే.. ఈ ఓటమిని ఎదుర్కొన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అది కూడా ఛేజింగ్‌లో 262 పరుగులు చేయడం విశేషం.

అంటే, టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా జట్టు పేరిట ఉండేది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 262 పరుగులతో దక్షిణాఫ్రికా జట్టు రికార్డును బద్దలు కొట్టింది. దీంతో టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్‌సీబీ సరికొత్త ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.




