నీకో పావలా.. నాకో పావలా.. నిర్మాతల నెత్తి మీద ఓటీటీ సంస్థల డాన్సులు..
10 రూపాయలు పెట్టి కొన్న వస్తువుపైనే సర్వహక్కులు మనకుంటాయి కదా..! అలాంటి కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాపై నిర్మాతకు అధికారం లేదా..? తాను తీసిన సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో కూడా సొంతంగా నిర్ణయించుకునే హక్కు లేదా..? నిర్మాతల నెత్తి మీద ఓటిటి సంస్థలు ఈ స్థాయిలో డాన్స్ చేయడానికి కారణమేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jun 08, 2025 | 9:12 PM

ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునేవాళ్లు నిర్మాతలు. కానీ అదంతా ఓటిటి మార్కెట్ బూమ్‌లో లేనపుడు.. అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనపుడు..! కానీ ఇప్పుడలా కాదు.. ఓటిటి సంస్థలే అన్నీ డిసైడ్ చేస్తున్నాయిప్పుడు. సినిమా పెద్దదైనా.. చిన్నదైనా వాళ్లు చెప్పిన టైమ్‌కే చేయాలి.. లేదంటే రైట్స్‌లో కోత తప్పదు.

ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమానే తీసుకోండి.. జూన్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. తనకు ఇష్టం లేకపోయినా.. టైమ్ సరిపోదని తెలిసినా ఓటిటి ఒప్పందాల కోసం జూన్ 12 అనుకున్నారు.

కానీ ఇప్పుడది కుదిరేలా కనిపించట్లేదు. నెక్ట్స్ కొత్త డేట్ వెతుక్కువాలన్నా కూడా అదే ఓటిటి సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. జులై 4న వీరమల్లును విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు మొదలయ్యాయి.

కానీ అదేరోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది.. ఆ సినిమాకు కూడా ఓటిటి డీల్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితార ఎంటర్‌టైన్మెంట్స్. ఇప్పుడు సడన్‌గా పవన్ కోసం డేట్ మారిస్తే.. వాళ్ళ ఓటిటి రేట్‌పై ప్రభావం తప్పదు.

జూన్ 12 నుంచి వీరమల్లు వాయిదా పడితే.. 20న కుబేరా.. 27న కన్నప్ప.. జులై 4న కింగ్డమ్, 11న ఘాటీ డేట్స్ లాక్ అయ్యాయి. అలా కాదని ఆగస్ట్ వైపు చూస్తే 14న వార్ 2.. 27న మాస్ జాతర డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇవన్నీ ఓటిటి డీల్స్ ప్రకారమే లాకైన రిలీజ్ డేట్స్. వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు. అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటిటి అండర్‌లోకి వెళ్లిపోయారని చెప్పేది.



















