War 2: టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న వార్ 2.. కారణం అదే..
వార్ 2.. టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. అందులో ఏముంది ప్రత్యేకత అంతగా అనుకోవచ్చు..? పేరుకు అది డబ్బింగ్ సినిమా అయినా అందులో నటిస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆ మాత్రం చర్చ కామన్. ఇంతకీ వార్ 2 ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది..? దానికి కారణమేంటి..? అన్నీ ఈ స్టోరీలో చూద్దామా..?
Updated on: May 14, 2025 | 5:27 PM

ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన గ్యాప్.. ఇకపై రాకూడదని వరస సినిమాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. గతేడాది దేవరతో వచ్చిన ఈయన.. ఏడాది తిరిగేలోపే వార్ 2 అంటూ ఆగస్ట్ 14న వచ్చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. జులై చివరివారం నుంచి ప్రమోషన్స్ కోసం వెళ్లనున్నారు. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు తారక్. వార్ 2 పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ అయిపోయారు తారక్.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక వార్ 2 తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. దీనికోసం అగ్ర నిర్మాతలు పోటీ పడుతున్నారు.

రేసులో సూర్యదేవర నాగవంశీ ముందున్నారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం అదంతా అబద్ధమే అని కొట్టి పారేసారు.ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడం.. పైగా సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉండటంతో తెలుగు రైట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి.

పైగా డబ్బింగ్ కూడా ఎన్టీఆరే చెప్పుకుంటున్నారు. తెలుగులో 100 నుంచి 120 కోట్ల మధ్యలో వార్ 2 రైట్స్ పలకబోతున్నట్లు తెలుస్తుంది. ఎంత తారక్ ఉన్నా.. అది డబ్బింగ్ సినిమానే కదా..! ఈ లెక్కన ఎన్టీఆర్ ముందు పెద్ద లక్ష్యమే ఉన్నట్లు.




