- Telugu News Photo Gallery Cinema photos Balakrishna's Akhanda 2 Pawan Kalyan's OG movie release date updates
ఆ విషయం లో బాలయ్యను కంగారు పెడుతున్న పవన్
ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటారు కదా..! ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్ మరో ఇద్దరు హీరోలను కంగారు పెడుతుంది. ముందొచ్చిన చెవుల కన్నా.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు పవన్ సినిమా అప్‌డేట్ రాగానే అంతా అటువైపే చూస్తున్నారు. మరి పవర్ స్టార్ రాకపో ప్రాబ్లమ్‌లో పడిన ఆ ఇద్దరు హీరోలెవరు..? అసలేంటి సంగతి..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 20, 2025 | 8:06 PM

పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందిప్పుడు. కానీ ఆయనెప్పుడు డేట్స్ ఇచ్చినా.. అలా 15, 20 రోజుల్లోనే రిలీజ్‌కు రెడీ అవుతాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు మే 9న విడుదలకు సిద్ధమైంది. ఇక ఓజి రిలీజ్ డేట్ మాత్రమే తరువాయి. ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు.

సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి షూటింగ్ 70 శాతం పూర్తైంది. పవన్ రెండంటే రెండు వారాలు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తైపోతుంది. అది త్వరలోనే అడ్జస్ట్ చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఓజి రిలీజ్ సెప్టెంబర్ చివరివారంలో ఉంటే మాత్రం.. ఇటు సాయి ధరమ్ తేజ్.. అటు బాలయ్యకు కంగారు తప్పకపోవచ్చు.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. నార్త్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. కుంభమేళా, హిమాలయాల్లోనూ షూట్ చేస్తున్నారు బోయపాటి.

ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదేరోజు సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు సినిమాను కూడా విడుదల చేస్తామన్నారు మేకర్స్.

సంబరాల యేటిగట్టు, అఖండ 2.. ఈ రెండూ ప్యాన్ ఇండియన్ సినిమాలే. వీటికి తోడు ఇప్పుడు ఓజి కూడా సెప్టెంబర్ చివరి వారంలో గానీ వచ్చిందంటే మాత్రం పోటీ మామూలుగా ఉండదు. ఒకవేళ పవన్ వస్తే.. తేజ్ సినిమా రాకపోవచ్చు. అలా చూసుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్ పోరు తప్పకపోవచ్చు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?





























