- Telugu News Photo Gallery Business photos Top 5 government schemes every indian should know in 2025 details in telugu
Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. పెట్టుబడికి బోలెడంత భరోసా..!
భారతదేశంలోని ప్రజలు ఏళ్లుగా పొదుపు పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్థిర ఆదాయాన్ని ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో గ్రామీలు పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకుని ఎక్కువ మంది పెట్టుబడికి ముందుకు వస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆయా పెట్టుబడి పథకాలపై వివిధ రాయితీలను అందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 పెట్టుబడి పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Apr 06, 2025 | 4:47 PM

పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడిగా స్థిరమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు పీపీఎఫ్ పథకంలోపెట్టుబడికి ముందుకు వస్తున్నారు. దాదాపు 7 నుంచి 8 శాతం వడ్డీ రేటుతో, పన్ను రహిత రాబడిని అందిస్తుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో అందుబాటులో ఉండడం వల్ల క్రమశిక్షణతో కూడిన పొదుపునకు మరోపేరుగా ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత చేసే పాక్షిక ఉపసంహరణలపై ఎలాంటి జరిమానాలు ఉండవు. అంతేకాకుండా పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హత ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన కుమార్తె భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టే వారి మొదటి ఎంపికగా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రస్తుతం 7.6% అత్యధిక వడ్డీ రేటును అందిస్తూ ఇతర చిన్న పొదుపు పథకాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పథకంలో పెట్టుబడికి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు 10 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు ఖాతా తెరవాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకంలో కూడా సెక్షన్ 80సీ కింద డిపాజిట్లు, ఉపసంహరణలపై పన్ను రహిత ప్రయోజనాలను అందిస్తాయి.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సంవత్సరానికి 8.2 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా త్రైమాసిక వడ్డీ చెల్లింపులను పొందవచ్చు. ఈ స్కీమ్ పదవీ విరమణ చేసిన వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తుంది. అలాగే మూడు సంవత్సరాల ఐచ్చిక పొడిగింపుతో సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో స్థిరమైన రాబడితో మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలలోపు పెట్టుబడిదారులకు వారి పెట్టుబడిపై 100 శాతం రాబడిని అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర హామీతో కూడిన రాబడిని కోరుకునే సంప్రదాయవాద పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా ఉంటుంది. ఈ పథకంలో ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటుతో వస్తుంది. అలాగే ఈ పథకం 2.5 సంవత్సరాల ప్రారంభ లాక్-ఇన్ వ్యవధి తర్వాత ఉపసంహరణ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన పథకం అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్న వారి భవిష్యత్తును కూడా భద్రపరచడంతో పాటు జీవితాంతం ఆదాయాన్ని అందించడానికి రూపొందించారు. ఈ పథకంలో నామమాత్రపు మొత్తాన్ని పెట్టుబడి పెడితే పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన కనీస నెలవారీ పెన్షన్ అందిస్తారు. ముఖ్యంగా ఖాతాదారులకు అరవై ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత 1,000 నుంచి 5,000 వరకు పింఛన్ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు.




