పెద్ద పోటుగాడిలా తాచుపామును చేతుల్తో పట్టి ముద్దులు పెట్టాడు.. చివరకు
Cobra: మద్యం మత్తులో నాగుపామును ఒట్టి చేతులతో పట్టుకుని జనం ముందు ఫోజులు కొట్టిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని విరార్‌లో చోటుచేసుకుంది. మెడలో వేసుకుని మస్తీ చేయగా పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్సకు ముందే మృతి చెందాడు.

మద్యం మత్తులో అతి ఉత్సాహంతో చేసే ప్రమాదకర స్టంట్లు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రమాదకర నాగుపామును పట్టుకుని ఆటపట్టించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని విరార్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విరార్ పశ్చిమంలోని నవాపూర్ ప్రాంతంలో పాము కనిపించడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాన్ని ఒట్టి చేతుల్తో పట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా జనం ముందు ఫోజు కొడుతూ.. పామును మెడలో వేసుకుని మస్తీ చేయడం ప్రారంభించాడు. చుట్టుపక్కల వారు హెచ్చరించినా.. వదిలిపెట్టమని వారించినా పట్టించుకోలేదు. చివరికి ఆ పాము అతని చేతిని కాటు వేసింది. దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఖారోడి ప్రాంతంలోని మహాపాలిక ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ప్రారంభించేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని రాజూ చందూ బర్డ్ (40)గా గుర్తించారు. పామును మెడలో వేసుకుని తిరుగుతుండగా చేతికి కాటు వేయడంతో.. విషం శరీరమంతా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనపై అర్ణాలా సాగేరిలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదకర విన్యాసాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. అందుకే మీకు ఎప్పుడైనా పాము తారసపడితే స్నేక్ క్యాచర్ లేదా ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. అంతేకానీ మీరే స్వయంగా దాన్ని పట్టే ప్రయత్నం చేయకండి…
View this post on Instagram
