Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీపై కాసుల వర్షం.. సీఎం నితీష్ కుమార్ భారీ నజరానా
Vaibhav Sooryavanshi : బీహార్ సంచలనం, 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై కాసుల వర్షం కురిసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026 శిక్షణ శిబిరంలో బిజీగా ఉన్న వైభవ్, ప్రత్యేకంగా పాట్నా చేరుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా భారీ సత్కారాన్ని అందుకున్నారు.

Vaibhav Sooryavanshi : బీహార్ సంచలనం, 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై కాసుల వర్షం కురిసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026 శిక్షణ శిబిరంలో బిజీగా ఉన్న వైభవ్, ప్రత్యేకంగా పాట్నా చేరుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా భారీ సత్కారాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో వైభవ్ పోషించిన అద్భుత పాత్రకు గుర్తింపుగా బీహార్ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది.
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, క్రీడల మంత్రి శ్రేయసీ సింగ్‌తో పాటు బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. గతంలో బీసీఏ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వైభవ్ హాజరుకాకపోయినప్పటికీ, స్వయంగా ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడంతో శిక్షణకు విరామం ఇచ్చి మరీ పాట్నా చేరుకోవడం విశేషం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ హోరాహోరీ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు రాబట్టి సంచలనం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే భారత్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడగలిగింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతితో బ్యాటింగ్ చేసిన వైభవ్‌ను ప్రధాని మోదీ సైతం గతంలో ప్రశంసించారు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో కఠిన సాధన చేస్తున్నాడు. గతేడాది కేవలం 35 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ బాది అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు ప్రాక్టీస్ సెషన్లలో చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం అందించిన ఈ భారీ ప్రోత్సాహం అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేలా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
