- Telugu News Photo Gallery Business photos Special Trains From Charlapalli To Different Railway Zones In South Central Railway And Andhra Pradesh
పండక్కి ఊరెళ్తున్నారా.? అయితే ఇదిగో సూపర్ గుడ్‌న్యూస్.. ఇక పండగో పండుగ
దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ముఖ్యమైన సందర్భాలలో లేదా సెలవులు/పండుగ సీజన్లలో రైలు ప్రయాణీకుల డిమాండ్లను తీర్చడానికి, అందుబాటులో ఉన్న వనరులను సమకూర్చడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..
Updated on: Jan 10, 2025 | 8:44 PM

రికార్డు సంఖ్యలో సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణీకులను తమ సొంతూళ్లకు చేర్చేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య జనవరి నెలలో సంక్రాంతి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటివరకు జోన్ సంక్రాంతి సీజన్‌లో 188 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మరో 178 ప్రత్యేక రైళ్లు జోన్ గుండా వెళుతున్నాయి. దీనితో మొత్తం 366 ప్రత్యేక రైళ్ల సర్వీసులు ఉన్నాయి.

ఈ రైళ్లలో ఎక్కువ భాగం రద్దీగా ఉండే సెలవుదినాలలో నడుపుతున్నారు. ఈ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలకు కూడా నడుస్తున్నాయి. చర్లపల్లి స్టేషన్ నుంచి నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం మొదలైన స్టేషన్‌ల వైపు 59 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

ఇందులో 16 జనసాధరణ రైళ్లు చర్లపల్లి-విశాఖపట్నం-చర్లపల్లి మధ్య సాధారణ కోచ్‌లతో ప్రత్యేకంగా నడుస్తాయి. అందుబాటు ధరలు, సౌకర్యవంతమైన ప్రయాణంతో మధ్యతరగతి ప్రజలకు ఇవి సౌకర్యంగా ఉండబోతున్నాయి.

సాధారణ రైళ్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించారు. అలాగే రైలు నెంబర్ 20833/20834 సికింద్రాబాద్-విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు జనవరి 11, 2025 నుంచి శాశ్వత ప్రాతిపదికన 4 అదనపు చైర్ కార్ కోచ్‌లను పెంచుతున్నారు.

నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బెర్హంపూర్, జైపూర్, గోరఖ్‌పూర్, కటక్, మధురై, అర్సికెరె మొదలైన ప్రముఖ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వీటితోపాటు జోన్ నుంచి నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ స్టేషన్ల గుండా చెన్నై, బెంగళూరు, మధురై జోన్‌ల నుంచి వచ్చే షాలిమార్, సంబల్పూర్, బరౌని, విశాఖపట్నం మొదలైన స్టేషన్లకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
