Indian Railways: ఏపీకి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్లో ప్రయాణం.. రైల్వేశాఖ కీలక అప్డేట్..
Vande Bharat Sleeper: ఏపీ ప్రజలకు శుభవార్త. రైల్వేశాఖ మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. తొలి రైలు జనవరిలో ప్రారంభం అవ్వగా.. మూడు నెలల తర్వాత రెండో రైలు మార్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన చేశారు.

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో ట్రైన్ ముంబై-బెంగళూరు మధ్య ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఏపీలో అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తుండగా.. ఇప్పుడు స్లీపర్ రైలు కూడా అందుబాటులోకి రానుంది.
రూట్ ఇదే..
ముంబై నుంచి బయల్దేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు పూణె, సోలాపర్, కలబురగి మీదుగా ఏపీలోని రాయచూర్, గుంతకల్‌కు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి బెంగళూరుకు వెళుతుంది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు రూట్లో నడుస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ మార్గంలోనే ఈ కొత్త రైలు ప్రయాణించనుంది. ఈ రైలుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎక్స్‌లో ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలుకు ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించేవారికి ఇది ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
మూడు నెలల తర్వాత..
జనవరిలో ప్రధాని మోదీ దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రారంభించారు. ఇప్పుడు మూడు నెలల తర్వాత రెండో రైలును ప్రకటించారు. తొలి స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. రాత్రిపూట సదూర ప్రాంతాలకు వెళ్లేవారికి మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. కాగా తొలి వందే భారత్ రైలు 2019లో ప్రారంభమైంది. ఢిల్లీ-వారణాసి మధ్య తొతి రైలు ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ సర్వీసులను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు 9.1 కోట్ల మంది ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించారు. వందే భారత్ రైల్లో స్లీపర్ కోచ్‌లు అందబాటులో లేవు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కూర్చోని ప్రయాణించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ తీసుకొచ్చింది. రాత్రిపూట ప్రయాణాల కోసం వీటిని తీసుకొస్తుంది. త్వరలోనే మరిన్ని స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
