Gold: సీన్ రివర్స్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. అసలు ఎందుకు తగ్గుతున్నాయో తెలుసా..?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, అనూహ్యంగా బంగారం, వెండి ధరలు మాత్రం భారీగా పతనమవుతున్నాయి. ఒక్క రోజులోనే వేల రూపాయల మేర తగ్గిన ఈ ధరల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఇది కొనుగోలుదారులకు వరమా.. ఇన్వెస్టర్లకు శాపమా? అనే విషయాలు తెలుసుకుందాం..

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి.
మార్కెట్లో భారీ పతనం
సోమవారం ట్రేడింగ్‌లో భారతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు కుప్పకూలాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.796 తగ్గి, రూ.1,51,856 వద్దకు చేరింది. వెండి ధరల్లో భారీగా పతనం నమోదైంది. కిలో వెండి ఏకంగా రూ.4,334 తగ్గి, రూ. 2,40,766 వద్ద స్థిరపడింది. స్పాట్ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,130గా ఉండగా, కిలో వెండి రూ. 2,39,230కి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో షాక్
ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడంతో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 4,720.09 డాలర్లకు పడిపోయాయి. వెండి కూడా ఔన్సుకు 74.4 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
సాధారణంగా యుద్ధ వాతావరణం ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. దీనికి ప్రధాన కారణాలను కేడియా అడ్వైజరీ వ్యవస్థాపకుడు అజయ్ సురేష్ కేడియా వివరించారు.
హోర్ముజ్ దిగ్బంధం – ద్రవ్యోల్బణం: హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఇంధన ధరలు పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
వడ్డీ రేట్ల భయం: ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించవని, బదులుగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
డాలర్ ఆధిపత్యం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి, ఈ వివాదం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు బంగారం 10శాతం, వెండి 20శాతం కంటే ఎక్కువ విలువను కోల్పోయాయి.
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గేవరకు మార్కెట్లలో ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై భారం పడటమే కాకుండా బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
