ఈసారి ఎగ్ కర్రీ ఇలా చేయండి.. ఎంత కమ్మగా ఉంటదో తెలుసా..?
ఈ ప్రత్యేకమైన ఎగ్ కర్రీ రెసిపీతో మీ కుటుంబ సభ్యులను సంతోషపెట్టండి. గుడ్లను ముందుగా బీట్ చేసి, వేయించి, ముక్కలుగా కట్ చేసి గ్రేవీలో వేయడం ఈ వంటకం ప్రత్యేకత. సాధారణ ఎగ్ కర్రీకి భిన్నంగా, ఇది మరింత రుచికరంగా, జ్యూసీగా ఉంటుంది. అన్నం లేదా చపాతీతో అద్భుతంగా ఉంటుంది.

ఎగ్ కర్రీ అంటే ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఈసారి కాస్త విభిన్నంగా, అత్యంత రుచికరమైన ఎగ్ కర్రీని మీ ఇంట్లో తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరచండి. ఈ ప్రత్యేకమైన రెసిపీని ఒక్కసారి రుచి చూస్తే, మళ్లీమళ్లీ ఇలాగే చేయమని అడుగుతారు. దీని తయారీ విధానం. రుచి సాధారణ ఎగ్ కర్రీకి భిన్నంగా, మరింత గొప్పగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:
* గుడ్లు: 4 (మీరు ఎంత మందికి వండుతున్నారో దాన్ని బట్టి పెంచుకోవచ్చు)
* పసుపు: 1/4 టీస్పూన్ (గుడ్ల కోసం) + 1/4 టీస్పూన్ (గ్రేవీ కోసం)
* కారం: 1/2 టీస్పూన్ (గుడ్ల కోసం) + 1 1/2 టీస్పూన్ (గ్రేవీ కోసం)
* ఉప్పు: రుచికి సరిపడినంత
* కొత్తిమీర తరుగు: 1 స్పూన్ (గుడ్ల కోసం) + కొద్దిగా (గ్రేవీలో) + కొద్దిగా (గార్నిష్ కోసం)
* నూనె: 2-3 స్పూన్లు (గ్రేవీ కోసం) + 1/2 స్పూన్ (గుడ్ల కోసం)
* హోల్ గరం మసాలా: కొద్దిగా (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు)
* ఉల్లిపాయ: 1 పెద్దది (చిన్న ముక్కలుగా కోసి)
మసాలా పేస్ట్ కోసం:
* అల్లం: చిన్న ముక్క
* వెల్లుల్లి: 5-6 రెబ్బలు
* పచ్చిమిర్చి: 2-3 (కారానికి తగ్గట్టు)
* జీడిపప్పు: 5-6 (కొన్ని)
* టమాటా: 2 మధ్యస్థం
*కొత్తిమీర: ఒక గుప్పెడు
గ్రేవీ కోసం అదనపు మసాలాలు:
* జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
* ధనియాల పొడి: 1/2 టీస్పూన్
* నీళ్లు: 2 గ్లాసులు
* ఎగ్ మసాలా / గరం మసాలా: 1/4 టీస్పూన్ (చివరగా)
తయారీ విధానం:
1.గుడ్ల మిశ్రమం తయారీ: ఒక గిన్నెలో నాలుగు గుడ్లను పగలగొట్టి వేయండి. ఇందులో పావు స్పూన్ పసుపు (నీచు వాసన రాకుండా), అర స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసి విస్కర్ లేదా ఫోర్క్‌తో బాగా గిలకొట్టండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
2. ఎగ్ పీసెస్ తయారీ:స్టవ్ వెలిగించి దోశ పాన్ లేదా ఏదైనా ఫ్లాట్ పాన్ పెట్టి, అర స్పూన్ నూనె వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్ల మిశ్రమంలో సగాన్ని పాన్‌లో వేసి, మూత పెట్టి లేదా మూత లేకుండా ఒక వైపు కాస్త కలర్ మారి, గట్టిపడిన తర్వాత వీడియోలో చూపిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. మిగిలిన సగం మిశ్రమాన్ని కూడా ఇలాగే చేయండి. రెండు భాగాలనూ ఒక ప్లేట్‌లోకి తీసుకుని, మీకు నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
3. గ్రేవీ కోసం మసాలా పేస్ట్ తయారీ: మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, చిన్న ముక్కలుగా కోసిన రెండు టమాటాలు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టండి.
4. గ్రేవీ తయారీ: స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, రెండు నుండి మూడు స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యాక కొద్దిగా హోల్ గరం మసాలా వేసి, వెంటనే సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయను వేసి, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించండి. ఇది చాలా ముఖ్యం.
5. మసాలా పేస్ట్ వేయడం: ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ను వేసి, పచ్చివాసన పోయేంతవరకు, నూనె పైకి తేలేంతవరకు మధ్యమధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి.
6. పొడి మసాలాలు కలపడం: పేస్ట్ బాగా వేగిన తర్వాత, మరొక పావు స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మసాలాలు మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వనివ్వండి.
7.నీళ్లు పోసి ఉడికించడం: మసాలాలు బాగా వేగిన తర్వాత, రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపి, మూత పెట్టి గ్రేవీ బాగా మరగనివ్వండి.
8. ఎగ్ పీసెస్ కలపడం: గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసి, బాగా కలిపి, కాస్త కొత్తిమీర తరుగు వేయండి. మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు ఉడికించండి.
9. ఫైనల్ టచ్: చివరగా, పావు స్పూన్ ఎగ్ మసాలా లేదా గరం మసాలా వేసి, బాగా దగ్గర పడేంతవరకు ఉడికించి, స్టవ్ ఆపివేయండి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి.
ఈ జ్యూసీ, రుచికరమైన ఎగ్ కర్రీ అన్నం, చపాతీ, రోటీ దేనితోనైనా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
